ఎస్పీ బాలుకు ఇళయరాజా నోటీసులా?

Sun Mar 19 2017 14:00:50 GMT+0530 (IST)

ఎస్పీ బాలసుబ్రమణ్యం పాటల గురించి మాట్లాడాల్సి వస్తే ఇళయరాజా ప్రస్తావన రాక మానదు. అలాగే ఇళయరాజా సంగీతం గురించి చర్చ మొదలుపెడితే.. బాలు ప్రస్తావన తేకుండా ఉండలేం. వాళ్లిద్దరిదీ లెజెండరీ కాంబినేషన్. ఇద్దరూ కలిసి వందల సంఖ్యలు పాటలు చేశారు. సంగీత ప్రియుల్ని మైమరిపించారు. ఇద్దరి మధ్య మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. ఇద్దరికీ పరస్పరం గౌరవాభిమానాలున్నాయి. అలాంటిది ఇళయరాజా.. బాలుకు నోటీసులు ఇచ్చారన్న వార్త ఇప్పుడు కలకలం రేపుతోంది. బాలు చేసే మ్యూజికల్ కన్సర్ట్స్ లో తన పాటలు వాడుకోవడం మీద ఇళయరాజా అభ్యంతరం చెప్పడం విశేషం. తన అనుమతి లేకుండా తన పాటలు ఎలా వాడుకుంటారని ఆయన ఈ నోటీసుల్లో ప్రశ్నించారట.

తన పాటల్ని సంగీత కచేరీల్లో.. ఇతర కార్యక్రమాల్లో ఇష్టానుసారం ఉపయోగిస్తుండటంపై కొంత కాలంగా ఇళయరాజా గుర్రుగా ఉన్నారు. ఒక మ్యూజికల్ కంపెనీకి కూడా ఆయన ఆ మధ్య నోటీసులిచ్చారు. తనకు రాయల్టీ ఇవ్వకుండా తన పాటలు వాడుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే కోవలో బాలుతో పాటు మరి కొందరికీ ఇళయరాజా నోటీసులిచ్చారు. ఈ నోటీసుల సంగతి బాలు కూడా ధ్రువీకరించారు. తాను దుబాయ్.. అమెరికా సహా చాలా దేశాల్లో కచేరీలు చేశానని.. ఐతే ఇళయరాజా అమెరికా కన్సర్ట్ కు సంబంధించి మాత్రమే నోటీసులివ్వడం ఆశ్చర్యం కలిగించిందని బాలు చెప్పారు. ఇకపై ఇళయరాజా పాటల్ని ఉపయోగించవద్దని తన బృందంలోని గాయనీగాయకులందరికీ చెప్పినట్లు బాలు వెల్లడించారు. తనతో ఇళయరాజాకు అంత అనుబంధం ఉండి.. నేరుగా తనతో మాట్లాడకుండా ఇలా నోటీసులివ్వడం పట్ల బాలు సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/