శాడిజం మళ్ళీ చూపించి ఇరగదీశాడు

Fri Oct 20 2017 09:43:47 GMT+0530 (IST)

కొంతమంది అసలు డైరక్షన్ వదిలేసి ఎందుకు నటులు అవుతారో.. ఆ తరువాత ఎందుకు విభిన్నపాత్రలు చేస్తారో.. అస్సలు అర్ధంకాదు. అలా అర్దంకాని వాళ్ళలో.. ఇక నేను డైరక్షన్ చేయను కేవలం నటుడిగానే స్థిరపడతాను అంటున్నవారిలో ఎస్.జె.సూర్య కూడా ఒకడు. మనోడు 'ఖుషీ' సినిమా నుండి తెలుగోళ్ళకు డైరక్టర్ గా పరిచయం. కాని 'స్పైడర్'తో తనలోని కొత్త యాంగిల్ చూపించాడు.మహేష్ బాబు స్పైడర్ సినిమాకు ఎలాంటి రిజల్టు వచ్చినా కూడా.. ఆ సినిమా నుండి అన్ని విధాలుగా ప్లస్ పాయింట్లు తెచ్చుకుంది ఎవరూ అంటే ఎస్ జె సూర్య అనే చెప్పాలి. ఎందుకంటే ఆ సినిమాలో శాడిస్ట్ విలన్ గా ఇతగాడి పెర్ఫామెన్స్ అదిరింది. ముఖ్యంగా మనోడు జనాలు ఏడవకపోతే తట్టుకోలేని ఆ పాత్రలో ఒదిగిపోయాడు. ఒక్కసారిగా ఇంత శాడిజం ఏంట్రా బాబోయ్ అంటూ సెకండాఫ్ అంతా ఆడియన్స్ షాకైపోయారు. ఇప్పుడు మరోసారి అలాంటి పెర్ఫామెన్సే చేశాడు ఈ డైరక్టర్. ఈసారి విజయ్ మెర్సాల్ సినిమాలో విలన్ గా కనిపించాడు. డ్యానీ అనే పాత్రలో పిచ్చెత్తించాడు. కాస్త శాడిజం కాస్త హీరోయిజం తరహాలో ఉండే ఈ విలన్ పాత్రతో.. తమిళ ఇండస్ర్టీకి ఇప్పుడు కొత్త విలన్ అయిపోయాడు.

త్వరలోనే రానున్న సెల్వరాఘవన్ సినిమాలో కూడా మనోడు విలన్ గా చేస్తున్నాడు. ఆ తరువాత మరో రెండు క్రేజీ ప్రాజెక్టులు కూడా ఒప్పుకున్నాడట. మరి తెలుగులో కూడా ఎవరన్నా ఇతన్ని డైరక్టు తెలుగు సినిమాకు విలన్ గా తీసుకుంటారేమో చూడాలి.