Begin typing your search above and press return to search.

బ్లాక్ బస్టర్ల డైరెక్టర్..ఇక సినిమాలు తీయడట

By:  Tupaki Desk   |   22 Sep 2017 7:18 AM GMT
బ్లాక్ బస్టర్ల డైరెక్టర్..ఇక సినిమాలు తీయడట
X
ఒక వాలి.. ఒక ఖుషి.. ఒక న్యూ (తమిళ నాని).. ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన దర్శకుడు ఎస్.జె.సూర్య. ‘వాలి’ సినిమా అప్పట్లో ఎంత పెద్ద సంచలనమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సౌత్ ఇండియాలో వచ్చిన ప్రత్యేకమైన సినిమాల్లో ఇదొకటిగా నిలిచింది. ఇక ‘ఖుషి’ అయితే అటు తమిళంలో.. ఇటు తెలుగులో చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ‘న్యూ’ కూడా తమిళనాట సంచలన విజయం సాధించింది. ఐతే ఆ తర్వాత తన స్థాయికి తగ్గ సినిమాలు తీయలేపోయాడు ఎస్.జె.సూర్య. వరుసగా ఫ్లాపులు ఎదుర్కొన్న సూర్య.. కొన్నేళ్ల నుంచి తన దర్శకత్వంలో సినిమాలే చేయట్లేదు. దర్శకుడిగా ఉన్నపుడు తన సినిమాల్లో తనే హీరోగా నటించిన సూర్య.. కొన్నేళ్ల కిందట బయటి సినిమాల్లో నటించడం మొదలుపెట్టాడు.

రెండేళ్ల కిందట ‘ఇరైవి’లో సూర్య నటనకు తమిళ పరిశ్రమ ఫిదా అయిపోయింది. దీంతో అతడికి అవకాశాలు వెల్లువెత్తాయి. ఇప్పుడు మహేష్ బాబు-మురుగదాస్ సినిమా ‘స్పైడర్’లో.. విజయ్ మూవీ ‘మెర్సల్’లో అతనే విలన్. చేతిలో ఇంకా చాలా సినిమాలున్నాయి. ఈ నేపథ్యంలో తాను ఇక మళ్లీ దర్శకుడిగా సినిమాలు చేయాలనుకోవట్లేదని చెప్పేశాడు సూర్య. మళ్లీ దర్శకుడిగా సినిమా ఎప్పుడు అని అడిగితే.. ‘‘నాలోని దర్శకుడు చాలానే చేశాడు. అతడిని ఇక విశ్రాంతి తీసుకోనివ్వండి. నిజానికి నేను నటుడవ్వాలనే ఇండస్ట్రీలోకి వచ్చా. అనుకోకుండా దర్శకుడినయ్యా. ఇప్పుడు నాకు నటుడిగా కొనసాగే అవకాశం వచ్చింది. మంచి పాత్రలు వస్తున్నాయి. అలాంటపుడు మళ్లీ దర్శకత్వం ఎందుకు’’ అన్నాడు సూర్య.