Begin typing your search above and press return to search.

మ‌హేష్ పేరుతో ఆడేసుకుంటున్న మీడియా

By:  Tupaki Desk   |   27 Aug 2016 5:30 PM GMT
మ‌హేష్ పేరుతో ఆడేసుకుంటున్న మీడియా
X
‘బాహుబ‌లి’ని మించిపోయే సినిమా తీయాల‌ని త‌పించిపోతున్నాడు త‌మిళ ద‌ర్శ‌కుడు సుంద‌ర్‌.సి. కానీ క‌థ రెడీ అయింది. వంద‌ల కోట్లు పోయ‌డానికి నిర్మాత కూడా రెడీ. కానీ ఈ ప్రాజెక్ట్ వ‌ర్క్ మొద‌లై ఏడాది అవుతున్నా ఇందులో న‌టించే హీరో ఎవ‌ర‌న్న‌దే తేల‌లేదు. సూర్య‌ను ట్రై చేశాడు కుద‌ర్లేదు. విజ‌య్ ను అడిగాడు. నో అనేశాడు. మ‌ధ్య‌లో మ‌న మ‌హేష్ బాబు పేరు వినిపించింది. కానీ అతీ గ‌తీ లేదు.

ఈ నేప‌థ్యంలో ఓ నెల రోజుల నుంచి ఈ సినిమా గురించి కొత్త క‌బుర్లేమీ వినిపించ‌లేదు. ఐతే తాజాగా మ‌ళ్లీ ఈ సినిమా గురించి ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. సుంద‌ర్ సినిమాకు మ‌హేష్ బాబు ఓకే చెప్పేసిన‌ట్లుగా త‌మిళ మీడియాలో రెండు రోజుల నుంచి వార్త‌లు జోరుగా వ‌స్తున్నాయి. ఈ సినిమాలో మ‌రో హీరోగా జ‌యం ర‌వి ఓకే అయ్యాడ‌ని.. వీళ్లిద్ద‌రితో క‌లిసి భారీ లెవెల్లో సుంద‌ర్ సినిమా ప్లాన్ చేశాడ‌ని అంటున్నారు.

ఐతే ప్ర‌స్తుతం మురుగ‌దాస్ తో సినిమా చేస్తున్న మ‌హేష్‌.. త‌ర్వాత కొర‌టాల క‌మిట్మెంట్ ఇచ్చాడు. జ‌న‌వ‌రి నుంచి ఈ సినిమా షూటింగ్ ఆరంభం కాబోతున్న‌ట్లు కూడా కొర‌టాల వెల్ల‌డించాడు. మ‌హేష్ కోసం ఇంకా పూరి జ‌గ‌న్నాథ్.. విక్ర‌మ్ కుమార్.. త్రివిక్ర‌మ్ లాంటి వాళ్లు వెయిటింగులో ఉన్నారు. వీళ్లంద‌రినీ కాద‌ని ఎంతో రిస్కుతో కూడుకున్న సుంద‌ర్ సినిమాకు మ‌హేష్ ఓకే చెప్పి ఉంటాడా అన్న‌ది డౌటే. కానీ త‌మిళ మీడియా మాత్రం మ‌హేష్ పేరు వాడేస్తూ ఈ సినిమా గురించి ఊహాగానాలు పెంచేస్తోంది.