ఆ హీరోయిన్ని నాని కూడా కాపాడలేదే..

Wed Apr 25 2018 05:00:02 GMT+0530 (IST)

రుక్సర్ ధిల్లాన్.. ఈ పేరు కూడా తెలుగు ప్రేక్షకులకు ఇంకా అలవాటు పడలేదు. ఐతే ఆమె ఇప్పటికే తెలుగులో మూడు సినిమాల్లో నటించిన విషయం చాలామందికి తెలియదు. ఈ నటికి కాస్త గుర్తింపు వచ్చింది నాని కొత్త సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’ ఒప్పుకోవడంతోనే. ఈ సినిమా కంటే ముందు రుక్సార్ రెండు తెలుగు సినిమాల్లో నటించింది. అందులో ఒకటి.. ఆకతాయి. పెద్దగా పేరులేని ఒక యువ కథానాయకుడితో రుక్సార్ చేసిన ఆ చిత్రం ఆమెకు ఎలాంటి గుర్తింపును తెచ్చిపెట్టలేదు. ఆ తర్వాత రాజమౌళి కజిన్ ఎస్.ఎస్.కాంచి దర్శకత్వంలో తెరకెక్కిన ‘షో టైం’ అనే థ్రిల్లర్ మూవీలో ఆమె నటించింది.ఈ చిత్రానికి మొదట్లో మంచి క్రేజే కనిపించింది కానీ.. ఆ సినిమా తర్వాత అడ్రస్ లేకుండా పోయింది. విడుదలకే నోచుకోలేదు. ఐతే రుక్సార్ టాలెంట్ చూసి రాజమౌళి అండ్ ఫ్యామిలీ నానికి ఆమెను రికమండ్ చేసినట్లు సమాచారం. వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని అయితే ఆమెకు బ్రేక్ ఇస్తాడని ఆశించారు. కానీ నాని సైతం ఆమెకు విజయాన్నందించలేకపోయాడు. మూడేళ్ల విరామానంతరం నానికి ‘కృష్ణార్జున యుద్ధం’ రూపంలోనే పెద్ద ఝలక్ తగిలింది. ఈ చిత్రంలో రుక్సార్ నటన ఏమంత ఆకట్టుకోలేదు. గ్లామర్ విషయంలో ఓకే అనిపించింది. అనుపమ ముందు ఆమె నిలబడలేకపోయింది. అయినా సినిమా బాగా ఆడితేనే ఈ చర్చంతా. ఫ్లాప్ అయ్యాక ఇంకేముంటుంది? మొత్తానికి టాలీవుడ్లో రుక్సార్ కెరీర్ దాదాపుగా క్లోజ్ అయినట్లే కనిపిస్తోంది.