Begin typing your search above and press return to search.

సినిమా రివ్యూ : రుద్రమదేవి

By:  Tupaki Desk   |   9 Oct 2015 10:40 AM GMT
సినిమా రివ్యూ : రుద్రమదేవి
X
‘రుద్రమదేవి’ రివ్యూ
నటీనటులు- అనుష్క - అల్లు అర్జున్ - రానా దగ్గుబాటి - ప్రకాష్ రాజ్ - కృష్ణం రాజు - నిత్య మీనన్ - కేథరిన్ థ్రెసా - విక్రమ్ జీత్ - సుమన్ - ఆదిత్య మీనన్ - హంసా నందిని - అజయ్ తదితరులు
ఛాయాగ్రహణం- అజయ్ విన్సెంట్
కూర్పు- శ్రీకర్ ప్రసాద్
కళా దర్శకత్వం- తోట తరణి
సంగీతం- ఇళయరాజా
మాటలు- పరుచూరి బ్రదర్స్, విపంచి, రాజసింహ
కథ - స్క్రీన్ ప్లే - నిర్మాణం - దర్శకత్వం- గుణశేఖర్

బాహుబలి తెలుగు ప్రేక్షకుల దృష్టిలోంచి ఇంకా చెరిగిపోలేదు. ఇంతలో మరో భారీ సినిమా ‘రుద్రమదేవి’ వచ్చేసింది. సినిమా తీయడానికి ఎంత కష్టపడ్డాడో, విడుదల కోసం కూడా అంతే కష్టపడిన గుణశేఖర్.. అన్ని ఇబ్బందుల్నీ దాటుకుని ఎట్టకేలకు తన కలల సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. మరి ‘బాహుబలి’కి దీటైన చిత్రం అవుతుందని ప్రేక్షకులు పెట్టుకున్న నమ్మకాన్ని ‘రుద్రమదేవి’ నిలబెట్టిందో లేదో చూద్దాం పదండి.

కథ:

కాకతీయ సామ్రాజ్యాన్ని కాపాడే వారసుడి కోసం రాజ్య ప్రజలందరూ ఎదురు చూస్తున్న సమయంలో గణపతి దేవుడికి (కృష్ణం రాజు) అమ్మాయి జన్మిస్తుంది. ఐతే అమ్మాయి పుడితే రాజ్య ప్రజలు నీరుగారిపోతారని.. దేవగిరి సామ్రాజ్యానికి చెందిన శత్రు సైన్యం దండెత్తి వస్తుందని భయపడి.. మంత్రి శివదేవయ్య (ప్రకాష్ రాజ్) సలహా మేరకు తనకు పుట్టింది అమ్మాయి కాదని, అబ్బాయి అని అబద్ధమాడి అందరినీ నమ్మిస్తాడు గణపతి దేవుడు. తన కూతురైన రుద్రమదేవి (అనుష్క)కు రుద్రదేవుడు అని నామకరణం చేసి అబ్బాయిలాగే పెంచుతాడు. యుద్ధ విద్యలు నేర్పిస్తాడు. మరి రుద్రదేవుడిగానే చెలామణి అయిన రుద్రమదేవి పెరిగి పెద్దయ్యాక రాజ్యాధికారం ఎలా చేపట్టింది... తన రహస్యం బయటపడ్డాక ఏం చేసింది.. తన రాజ్యంపైకి దండెత్తి వచ్చిన మహాదేవుడు (విక్రమ్ జీత్)ను ఎలా ఎదుర్కొంది.. చాళుక్య వీరభద్రుడు (రానా), గోన గన్నారెడ్డి (అల్లు అర్జున్)ల సాయంతో ఆమె యుద్ధంలో ఎలా గెలిచింది.. అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

జూనియర్ ఎన్టీఆర్ కు ‘రుద్రమదేవి’ కథ చెప్పి.. గోన గన్నారెడ్డి క్యారెక్టర్ చేయమన్నాడట గుణశేఖర్. ఐతే గోన గన్నారెడ్డి క్యారెక్టర్ని డెవలప్ చేసి హీరోగా కథ తయారు చేస్తే సినిమా చేయడానికి ఓకే అన్నాడట ఎన్టీఆర్. కానీ తాను ఒప్పుకోలేదని.. ‘రుద్రమదేవి’ కథ తీయడానికే పట్టుబట్టి చివరికి ఆ సినిమానే తీశానని చెప్పుకున్నాడు గుణశేఖర్. కానీ ఎన్టీఆర్ మాట మన్నించి గుణశేఖర్.. గోన గన్నారెడ్డినే హీరోను చేసి సినిమా తీసి బావుండేదేమో అని ‘రుద్రమదేవి’ చూసిన ప్రేక్షకులకు అనిపిస్తే అందులో ఆశ్చర్యమేమీ లేదు.

‘రుద్రమదేవి’కి ప్రధాన ఆకర్షణగా చెప్పుకున్న యుద్ధ సన్నివేశం ముగింపులో రుద్రమదేవిని శత్రు సైన్యం చుట్టుముడుతుంది. ఆమె చేతిలో ఆయుధం కూడా ఉండదు. ఏం చేయాలో తోచక రుద్రమదేవి దిక్కులు చూస్తుంటుంది. అప్పుడొస్తాడు గోన గన్నారెడ్డి. ఆమె చేతికి ఆయుధాన్నిచ్చి ఆమెను ఆదుకుంటాడు. రుద్రమతో కలిసి శత్రు సేనల్ని సంహరిస్తాడు. గుణశేఖర్ ఏ ఉద్దేశంతో ఈ సన్నివేశం ఇలా తీశాడో కానీ.. అది ‘రుద్రమదేవి’ సినిమా పరిస్థితికి సింబాలిక్ షాట్ గా చెప్పుకోవచ్చు. కథలోని ‘రుద్రమదేవి’ని మాత్రమే కాదు.. ‘రుద్రమదేవి’ సినిమాను కూడా ఆదుకున్నది అల్లు అర్జున్ పోషించిన గోన గన్నారెడ్డి పాత్రే.

బాహుబలి లాంటి ఓ కల్పిత గాథతో ఏం చేసినా చెల్లిపోతుంది. కథను ఎలా కావాలంటే అలా మలుపులు తిప్పేయొచ్చు. ప్రధాన పాత్రలతో ఏ విన్యాసాలైనా చేయించొచ్చు. కానీ చరిత్రలో నిజంగా జరిగిన కథల్ని తెరకెక్కించడం చాలా పెద్ద సాహసం. ఎందుకంటే ఉన్నదున్నట్లు చూపిస్తే డ్రామా పండదు. డ్రామా మీద దృష్టిపెడితే చారిత్రక కథాంశంతో సినిమా తీయడంలో అర్థం ఉండదు. ఈ రిస్క్ తెలిసే రంగంలోకి దిగాడు గుణశేఖర్. బహుశా అమ్మాయి అబ్బాయిగా చెలామణి అయి రాజ్యాధికారం చేపట్టడం అనే పాయింట్ అతణ్ని ఎగ్జైట్ చేసి ఉండొచ్చు. కానీ ఈ పాయింటు చుట్టూ ఆసక్తికర కథనాన్ని కూర్చుకోవడంలో మాత్రం గుణ అంతగా సక్సెస్ కాలేకపోయాడు.

ఒక్క గోన గన్నారెడ్డి పాత్ర విషయంలో మాత్రమే గుణశేఖర్ ఆసక్తి రేపగలిగాడు. ఆ క్యారెక్టర్ విషయంలో సినిమాటిక్ లిబర్టీ తీసుకుని.. ప్రేక్షకులతో విజిల్స్ కొట్టించే ‘కమర్షియల్’ హంగులు అద్దిన గుణ.. మిగతా పాత్రల విషయంలో ఆ ఫ్రీడమ్ ఎందుకు తీసుకోలేకపోయాడో మరి. చరిత్ర తిరగేస్తే కచ్చితంగా గోన గన్నారెడ్డి పాత్ర ఇలాగైతే ఉండి ఉండదు. భాష, యాస, స్టైల్.. ఇలా ప్రతి విషయంలోనూ అల్లు అర్జున్ పోషించిన గోన గన్నారెడ్డి పాత్ర ఆకట్టుకుంటుంది. లాజిక్కుల గురించి ఆలోచించకుండా ఆ పాత్రతో కనెక్టయిపోతాం. కానీ గోన గన్నారెడ్డి పాత్రను తీర్చిదిద్దడంలో పెట్టిన శ్రద్ధ... తీసుకున్న సినిమాటిక్ లిబర్టీ.. రుద్రమదేవి, ఇతర పాత్రల విషయంలోనూ ఉండుంటే ‘రుద్రమదేవి’ మరపురాని సినిమా అయ్యేదే.

‘బాహుబలి’తో ‘రుద్రమదేవి’కి పోలికే లేదని గుణశేఖర్ అన్నా... చివరి అరగంట కథనాన్ని ‘బాహుబలి’ తరహాలోనే యుద్ధ సన్నివేశాలతో నడిపించినపుడు ఎందుకు పోల్చుకోం? ఐతే బాహుబలి యుద్ధ సన్నివేశాల్ని చూసిన కళ్లతో ‘రుద్రమదేవి’ వార్ సీన్స్ చూస్తే నిరాశ తప్పదు. ట్రైలర్లో చూపించిన పాము-గద్ద రూపాల్లో సైనికులు కదలడం వరకు గ్రాఫిక్ వర్క్ బావుంది కానీ.. ఆ సన్నివేశంలో మాత్రం బలం లేకపోయింది. ఇంకెప్పుడొస్తాయా అని ఎదురు చూసిన యుద్ధ సన్నివేశాల్ని కొంచెం సమయం గడిచాక.. ఇక ఎప్పుడు ముగిస్తారా అని ఎదురు చూసేలా తయారు చేశాడు గుణశేఖర్. యుద్ధ సన్నివేశాలకు సంబంధించి తనకున్న లిమిటేషన్స్ లోనే గుణశేఖర్ కష్టపడ్డప్పటికీ.. అవి ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసే స్థాయిలో లేవు.

రుద్రమదేవి లాంటి చారిత్రక కథను రెండున్నర గంటల్లో గుణశేఖర్ ఎలా చెప్పి ఉంటాడా అని ముందు సందేహించి ఉంటాం కానీ.. సినిమా చూశాక మాత్రం గంటన్నరలో ముగించాల్సిన కథను మరీ ఇంత సాగదీసి చెప్పాడేంటి అన్న ఫీలింగ్ కలుగుతుంది. 2 గంటల 40 నిమిషాల నిడివి సినిమాకు పెద్ద మైనస్. అంత నిడివి అవసరం అన్న ఫీలింగ్ కలిగించదు సినిమా. ప్రథమార్ధంలో చిన్నప్పటి రుద్రమ (ఉల్కా గుప్తా చేసింది) చుట్టూ అల్లిన సన్నివేశాలు బాగున్నాయి. అల్లు అర్జున్ పాత్ర ప్రవేశించి.. కాసేపు మెరుపులు మెరిపించే వరకు కథనం బాగానే అనిపిస్తుంది. ఐతే ఆ తర్వాత రానా పాత్ర ప్రవేశంతో మరింత ఆసక్తికరంగా సాగాల్సింది పోయి.. నీరసిస్తుంది. రానా పాత్రలో ఏమాత్రం బలం లేకపోవడం.. అనుష్కకు, అతడికి మధ్య వచ్చే రొమాంటిక్ ట్రాక్ తేలిపోవడంతో కథనం గాడి తప్పింది. ఇంటర్వెల్ కు ముందు రుద్రమదేవి పెళ్లి ఘట్టం దగ్గర కొంత ఉత్కంఠ రేగుతుంది.

ఐతే ఇంటర్వెల్ దగ్గర రుద్రమదేవికి సంబంధించి రహస్యం బయపడుతుందేమో.. అక్కణ్నుంచి కథ రసవత్తర ఘట్టంలోకి వెళ్తుందేమో.. ఇక రుద్రమదేవికి, శత్రువుకు మధ్య ఎత్తులు పై ఎత్తులు.. యుద్ధ సన్నివేశాలతో కథనం స్పీడందుకుంటుంటుందేమో అనుకుంటే.. ద్వితీయార్ధం ప్రేక్షకుడి అంచనాలకు భిన్నంగా సా....గుతుంది. అనవసర సన్నివేశాలతో కాలక్షేపం చేసిన దర్శకుడు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టాడు. రుద్రమకు సంబంధించిన రహస్యాన్ని బయటపెట్టేసరికి పుణ్యకాలం గడిచిపోతుంది. అప్పటికే నీరసించిన ప్రేక్షకుడు యుద్ధ సన్నివేశాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో నిరుత్సాహానికి గురవుతాడు.

ప్రథమార్ధాన్ని ఆదుకున్న గన్నారెడ్డి పాత్ర చివర్లోనూ వచ్చి కొంచెం మెరుపులు మెరిపించబట్టి కొంచెం సంతృప్తితో సినిమా ముగుస్తుంది. గోన గన్నారెడ్డి పాత్రకు ఇచ్చిన కొసమెరుపు బావుంది. యుద్ధ సన్నివేశాల్లో గోన గన్నారెడ్డి పాత్రను హైలైట్ చేయడం కోసం రుద్రమదేవి క్యారెక్టర్ని తేల్చేశాడు గుణశేఖర్. రానా క్యారెక్టర్ గురించైతే చెప్పాల్సిన పని లేదు. చాలా చోట్ల ఉత్సవ విగ్రహం అయిపోయింది చాళుక్య వీరభద్రుడి పాత్ర. ‘రుద్రమదేవి’ గొప్పదనమేంటో అందరికీ తెలియజెప్పడానికే సినిమా తీశానన్న గుణశేఖర్.. ఆ పాత్ర తాలూకు గొప్పదనాన్ని తెరమీద ఎస్టాబ్లిష్ చేయడంలో ఫెయిలయ్యాడు.

నటీనటులు:

అనుష్క బాగా కష్టపడిన సంగతి తెరమీద కనిపిస్తుంది. రుద్రమదేవి పాత్రకు ఆమె రూపం, ఆహార్యం సరిపోయాయి. కానీ నటన విషయంలో మాత్రం అనుష్క నిరాశ పరిచింది. పాత్రకు తగ్గ రౌద్రం, గాంభీర్యం చూపించడంలో ఆమె విఫలమైంది. ఈ భావాలు పలికించాల్సిన సన్నివేశాల్లో ఊరికే అలా బిగుసుకుపోవడం తప్పితే.. తన నటనతో ఆ ఫీల్ తేలేకపోయింది అనుష్క. యుద్ధ సన్నివేశాల్లో ఆమె బాడీ లాంగ్వేజ్ బాలేదు. ఆమె భల్లెం విసరడం, కత్తి తిప్పడంలో చాలా వీక్ గా కనిపించడంతో యుద్ధ సన్నివేశాల్లో ముందే పట్టు సడలిపోయింది. ఐతే ఇందులో దర్శకుడిదే ప్రధాన వైఫల్యం. గ్లామర్ విషయంలో మాత్రం అనుష్క ఆకట్టుకుంది. చిన్నప్పటి రుద్రమగా నటించిన ఉల్కా గుప్తా బాగా నటించింది.

గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ మాత్రం తన పాత్రకు న్యాయం చేశాడు. పాత్ర ఔచిత్యం విషయంలో అభ్యంతరాలుంటే ఉండొచ్చు.. కానీ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడంలో మాత్రం బన్నీకి వందకు వంద మార్కులు పడిపోతాయి. టిపికల్ తెలంగాణ యాసతో డైలాగులు చెబుతూ తాను స్కీన్ పై కనిపించిన ప్రతి నిమిషం అలరించాడు బన్నీ. అతడికి మంచి డైలాగులు కూడా పడ్డాయి. లుక్ కూడా డిఫరెంటుగా ఉంది. బాహుబలిలో భల్లాల దేవుడిగా అంత పవర్ ఫుల్ గా కనిపించిన రానా.. చాళుక్య వీరభద్రుడిగా మాత్రం ఓ ముద్ర వేయలేకపోయాడు. ఏదైనా పాత్రను బట్టే ఉంటుందనడానికి ఇదే రుజువు. రానా నటన కూడా మామూలుగా అనిపిస్తుంది. శివదేవయ్య పాత్రలో ప్రకాష్ రాజ్ తన స్థాయేంటో చూపించాడు. అతడి వాయిసే ఆ పాత్రను ప్రత్యేకంగా నిలబెట్టింది. నిత్యమీనన్ చిన్న పాత్రలో బాగా చేసింది. విలన్ గా విక్రమ్ జీత్ పెద్దగా చేసిందేమీ లేదు. కృష్ణం రాజు - సుమన్ - ఆదిత్య మీనన్ పాత్రలకు తగ్గట్లు నటించారు. కేథరిన్ థ్రెసా - హంసా నందిని సినిమాకు గ్లామర్ టచ్ ఇచ్చారు.

సాంకేతిక వర్గం:

ఇళయరాజా పాటలు, నేపథ్య సంగీతం బాలేదని చెప్పలేం కానీ.. ఈ సినిమాకు ఆయనిచ్చిన ‘క్లాస్’ మ్యూజిక్ సూటవ్వలేదనడానికి మాత్రం సందేహించాల్సిన పని లేదు. కొన్ని చోట్ల నేపథ్య సంగీతం బాగుంది కానీ.. కొన్ని చోట్ల ఎఫెక్టివ్ గా అనిపించదు. రోమాలు నిక్కబొడుచుకోవాల్సిన సన్నివేశాల్లో బ్యాగ్రౌండ్ స్కోర్ సాత్వికంగా అనిపిస్తుంది. పాటలు కూడా మరీ క్లాస్ అయిపోయాయి. రెండు మెలోడీలు వినసొంపుగా ఉన్నా.. అవి సినిమా మూడ్ కు తగ్గట్లు లేవు. అజయ్ విన్సెంట్ ఛాయాగ్రహణం బాగుంది. తోట తరణి సెట్టింగ్స్, నీతా లుల్లా కాస్ట్యూమ్ డిజైనింగ్ సినిమాకు పెద్ద ప్లస్. ఈ రెండు విభాగాల్లో ‘బాహుబలి’ కంటే రుద్రమదేవి ఓ మెట్టు పైనే ఉంటుంది. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్టుల విషయంలో ఖర్చు, భారీతనం కనిపిస్తుంది. తనకున్న లిమిటేషన్స్ ను దాటి చాలానే ఖర్చు పెట్టాడు గుణ. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ నీట్ గా ఉంది కానీ.. అనవసర సన్నివేశాలకు కత్తెర వేసే విషయంలో గుణశేఖర్ ఆయనకు స్వేచ్ఛ ఇచ్చినట్లు లేడు. అర గంటయినా కోత వేయాల్సింది. పరుచూరి సోదరులతో పాటు విపంచి, రాజసింహ కలిసి రాసిన మాటలు చాలావరకు బాగున్నాయి. ప్రకాష్ రాజ్, అల్లు అర్జున్ పాత్రలకు రాసిన మాటలు హైలైట్. ముఖ్యంగా బన్నీకి రాసిన ప్రతి డైలాగ్ విజిల్స్ కొట్టిస్తుంది. సినిమాలో సమస్యంతా దర్శకుడితోనే. బన్నీని ఒప్పించడానికి, షూటింగ్ సందర్భంగా అతణ్ని మెప్పించడానికి గోన గన్నారెడ్డి పాత్ర మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లున్నాడు గుణ. ఆ శ్రద్ధ మిగతా పాత్రల విషయంలో, కథనం విషయంలో కూడా పెట్టి ఉంటే ‘రుద్రమదేవి’ మరోలా ఉండేదే.

చివరగా: రుద్రమదేవి కోసం కాదు కానీ.. గోన గన్నారెడ్డి కోసం.. ఒక్కసారి!

రేటింగ్ - 2.75/5
(నోట్: ఇది 2డీ సినిమా రివ్యూ)

#Rudhramadevi, #RudhramadeviMovie, #RudhramadeviReview, #RudhramadeviMoviereview, #anushkarudhramadevi, #Rudhramadevi Talk, #RudhramadeviRating



Disclaimer : This Review is an Opinion of Review Writer. Please Do not Judge the Movie based on This Review and Watch Movie in Theatre