Begin typing your search above and press return to search.

అలాగైతే డజన్‌ సినిమాలే వస్తాయ్‌

By:  Tupaki Desk   |   14 Oct 2015 1:30 AM GMT
అలాగైతే డజన్‌ సినిమాలే వస్తాయ్‌
X
రుద్రమదేవి కోసం బ్రూస్ లీ త్యాగం చేయాలంటూ... దాసరివారు సెలవిచ్చారు. మేము తీసింది సినిమానే.. మరోటేం కాదు అన్నట్లుగా సమాధానమిచ్చారు బ్రూస్ లీ టీం. తెలుగు సినీ ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా భావించే దాసరి నారాయణ చెప్పింది బాగుంటే.. మెగా క్యాంప్ నుంచి వచ్చిన సమాధానం ఇంకా అదిరింది.

సరే.. వీళ్ల వివాదం సంగతి కాసేపు పక్కన పెడితే.. ఒకేసారి రెండు సినిమాలు హిట్ అవ్వవా? అన్నది ఇప్పుడు ప్రశ్న. అది కూడా పండుగ సెలవు రోజుల్లో రెండు సినిమాలు ఒకే రిలీజ్ చేసుకునే ఛాన్స్ టాలీవుడ్ లో లేదా అనే సందేహం మొదలవుతోంది ఇప్పటి గొడవ చూస్తుంటే.

గతేడాది.. ఎవడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. రెండూ ఒకేసారొచ్చి సూపర్ సక్సెస్ సాధించాయి. మల్టీ స్టారర్ గా వచ్చి మహేష్ సినిమా హాఫ్ సెంచరీ కొడితే.. సింగిల్ గానే నలభై దాటేశాడు చెర్రీ. ఇంకో పదేళ్లు వెనక్కెళితే.. శంకర్ దాదా ఎంబీబీఎస్ ని చిరంజీవి రిలీజ్ చేసిన రోజునే.. శేఖర్ కమ్ముల ఆనంద్ ని విడుదల చేసి టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యాడు. రెండు మూవీస్ మంచి హిట్ అయ్యాయి. బడ్జెట్ ప్రకారం చూసుకుంటే.. శంకర్ దాదా కంటే ఆనంద్ నే బిగ్ హిట్ అనాలి.

రీసెంట్ గా శ్రీమంతుడు రికార్డులు సృష్టిస్తున్నా.. అంతకు నెలరోజుల ముందొచ్చిన బాహుబలి జోరు తగ్గలేదు. అంటే.. కంటెంట్ ఉన్న మూవీకి కటౌట్ చాలు. ఈ విషయం ఇప్పుడు బాగానే స్పష్టమయిపోతోంది. కనీసం సరైన పబ్లిసిటీ కూడా లేకుండానే మయూరితో నయన తార హిట్ సాధించింది.

సినిమాలో సత్తా ఉంటే ఏదైనా ఆడుతుంది. ఆ చిత్రం చిన్నదైనా, పెద్దదైనా చూసేవాళ్లకి పెద్ద తేడా ఏం ఉండదు. ఎంత బడ్జెట్ పెట్టి తీశారు అని లెక్కలేసుకుని థియేటర్లకు జనాలు వస్తారా ఏంటి ? వాళ్లిచ్చే డబ్బులు, వెచ్చించే సమయానికి సరిపడేంత వినోదం, కొత్తదనం గిట్టుబాటు అవుతుందా అని ఆలోచిస్తారు ప్రేక్షకులు. రాజమౌళి నాలుగేళ్లు కష్టపడ్డాడు పాపం అని జనాలు థియేటర్లకు రారు కదా. మూడు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న దాసరి.. ఆదివారం ఆడవాళ్లకు సెలవు అనే మూవీకి.. ఏళ్లు కష్టపడి కథ రాసి ఇది, డజన్ సార్లు రైటప్ ఫైనలైజ్ చేశానని చెప్పారు. అయితే మాత్రం జనాలు థియేటర్ల వైపు కన్నెత్తి చూశారా? అట్టర్‌ ఫ్లాపయ్యిందా సినిమా.

ఒక్కో సినిమాకి 3-4 వారాలు టైం ఇవ్వాలంటే.. తెలుగులో ఏడాదికి ఓ డజన్ సినిమాలొస్తాయంతే. తెలుగు సినిమా రంగం ఇలా పది పన్నెండు సినిమాలతో బతికేస్తుందా? ఈ విషయం అందరూ ఆలోచిస్తే బెటర్‌.