Begin typing your search above and press return to search.

బండ్ల ఎఫెక్ట్‌!... నాగ‌బాబుకు ఇబ్బందేనా?

By:  Tupaki Desk   |   14 Dec 2017 9:22 AM GMT
బండ్ల ఎఫెక్ట్‌!... నాగ‌బాబుకు ఇబ్బందేనా?
X
మెగాస్టార్ చిరంజీవి పెద్ద త‌మ్ముడిగానే కాకుండా... మెగా ఫ్యామిలీపై ఏ ఒక్క‌రు దాడి చేసినా చాలా ప్రొయాక్టివ్‌ గా రియాక్ట్ అయ్యే నాగ‌బాబుకు ఇప్పుడు ఓ కొత్త ఇబ్బంది వ‌చ్చింద‌న్న వాద‌న వినిపిస్తోంది. అస‌లు నాగ‌బాబుకు వ‌చ్చిన ఈ ఇబ్బందితో ఆయ‌న‌కు ఏమాత్రం ప్ర‌మేయం కూడా లేద‌ట‌. మ‌రి త‌న ప్ర‌మేయం లేకుండా ఎదురు వ‌చ్చిన ఆ ఇబ్బందిని నాగ‌బాబు ఎలా అధిగ‌మిస్తార‌న్న ప్ర‌శ్న ఇప్పుడు అటు సినీ జ‌నాల‌తో పాటు ఇటు మెగా అభిమానుల‌ను... మొత్తంగా తెలుగు ప్ర‌జ‌ల‌ను బాగానే వేదిస్తోంది. అయినా ఏమాత్రం క‌ల్మ‌శం లేకుండా వ్య‌వ‌హ‌రించే త‌త్వ‌మున్న నాగ‌బాబుకు ఇబ్బంది రావ‌డ‌మంటేనే కాస్తంత ఆలోచించ‌ద‌గ్గ విష‌య‌మే. అటు అన్న‌య్య‌ - ఇటు త‌మ్ముడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్... ఇద్ద‌రూ హీరోలుగా ఎదిగినా... నాగబాబు వారిపై ఈగ వాల‌కుండా చూసుకుంటున్నార‌న్న వాద‌న ఉంది. మ‌రి అలాంటి నాగ‌బాబుకు ఇబ్బందిని అన్నాత‌మ్ముళ్లిద్ద‌రూ తీర్చేస్తారులే అనుకునేందుకు కూడా వీలు లేద‌ట‌. ఎందుకంటే... ఈ ఇబ్బంది నుంచి నాగ‌బాబు త‌న‌ను తాను మాత్ర‌మే బ‌య‌ట‌ప‌డేసుకోవ‌డం మిన‌హా అన్నాత‌మ్ముళ్లిద్ద‌రూ చేయ‌గ‌లిగిందేమీ లేద‌న్న మ‌రో కొత్త వాద‌న కూడా వినిపిస్తోంది.

అస‌లు విష‌యంలోకి వెళితే... నిన్న ఓ టీవీ ఛానెల్ నిర్వ‌హించిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ సినీ న‌టి - వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాతో టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత బండ్ల గ‌ణేశ్ వాద‌న పెట్టుకున్నాడు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ కు ప్రాణ‌మిచ్చే అభిమానిగా ఉన్న బండ్ల గ‌ణేశ్‌... స‌ద‌రు లైవ్ షోలో రోజాపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. త‌న‌తో పాటు ల‌క్ష‌లాది మంది అభిమానించే ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను... వాడు - వీడు... అని ఎలా మాట్లాడ‌తార‌ని ఆయ‌న రోజాను ప్ర‌శ్నించారు. అయితే తానేమీ ప‌వ‌న్‌ ను త‌క్కువ చేసి మాట్లాడ‌లేద‌ని - ఏది మాట్లాడినా రాజ‌కీయ కోణాల్లో నుంచే మాట్లాడాను త‌ప్పించి - వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు దిగ‌లేద‌ని. అలా తానెప్పుడూ చేయ‌న‌ని కూడా రోజా బ‌దులిచ్చారు. ఈ క్ర‌మంలోనే వారిద్ద‌రి మ‌ధ్య వాద‌న మ‌రింత ముద‌ర‌గా... ఇద్ద‌రి మ‌ధ్య మాట‌ల తూటాలు పేలాయి. మొత్తానికి బండ్ల గ‌ణేశ్ పుణ్య‌మా అని... ప‌వ‌న్‌ను రోజా ఏమ‌న్నారో తెలియ‌దు గానీ, ఈ చ‌ర్చా కార్య‌క్ర‌మంతో మెగా ఫ్యామిలీకి రోజా విరోధిగా మారిపోయారు. అంత జ‌రిగిందా? అంటే... అంతేమీ లేదు గానీ... మెగా ఫ్యాన్స్‌ - ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు మాత్రం రోజాను శ‌త్రువుగానే చూస్తున్నార‌ట‌.

ఇక్క‌డి దాకా బాగానే ఉన్నా... ఇక్క‌డే నాగ‌బాబుకు అస‌లు స‌మ‌స్య మొద‌లైంద‌ట‌. ఎందుకంటే చాలా కాలం నుంచి ఈటీవీలో టాప్ ప్రోగ్రామ్‌ గా పేరుగాంచిన జ‌బ‌ర్‌ ద‌స్త్ కార్య‌క్ర‌మానికి రోజాతో పాటు నాగ‌బాబు కూడా జ‌డ్జీలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. జ‌బ‌ర్‌ ద‌స్త్ అంటేనే నాగ‌బాబు గుర్తుకు వ‌చ్చే ప‌రిస్థితి. మెగా ఫ్యామిలీకి శ‌త్రువుగా మారిన రోజాతో క‌లిసి ఇక‌పై ఆ షోలో పాల్గొన‌రాద‌ని మెగా ఫ్యాన్స్ ఇప్పుడు స‌రికొత్త వాద‌న‌ను తెర మీద‌కు తెచ్చార‌ట‌. ఈ మాట అటూ ఇటూ తిరిగి నాగ‌బాబు వ‌ద్ద‌కు కూడా చేరిపోయింద‌ట‌. ప్ర‌స్తుతం నాగ‌బాబుకు జ‌బ‌ర్‌ ద‌స్త్ ప్రోగ్రాం పున‌ర్జ‌న్మ ఇచ్చిన కార్య‌క్ర‌మంగానే జ‌నం చెప్పుకుంటున్న విష‌యం తెలిసిందే. మ‌రి అలాంటి కార్య‌క్ర‌మం నుంచి త‌న‌ను బ‌య‌ట‌కు ర‌మ్మనే మెగా ఫ్యాన్స్‌ కు నాగ‌బాబు ఏం స‌మాధానం చెబుతార‌న్న‌దే ఇప్పుడు స‌మాధానం లేని ప్ర‌శ్న‌గా మారింది.

గ‌తంలో ఈ త‌ర‌హా వివాదాలు వ‌చ్చిన సంద‌ర్భంగా రాజ‌కీయాలు వేరు - సినిమా వేరు - వినోదం వేరు అని చెబుతూ నాగ‌బాబు నెట్టుకొచ్చేశారు. అయితే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ పిచ్చిగా అభిమానించే బండ్ల గ‌ణేశ్ పెట్టిన స‌రికొత్త వివాదంతో ఆయ‌న జ‌బ‌ర్‌ ద‌స్త్‌ లో రోజా ప‌క్క‌న కూర్చుని గ‌తంలో మాదిరిగా క‌ల్మ‌శం లేని న‌వ్వు న‌వ్వగ‌ల‌రా? అన్న‌ది ఇప్పుడు జ‌నం మ‌దిని తొలిచేస్తోంది. అయినా నాగ‌బాబు నుంచి స్పంద‌న వ‌చ్చే దాకా కూడా ఆగ‌లేక‌పోతున్న మెగా ఫ్యాన్స్... ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆయ‌న‌పై ఒత్తిడి తెస్తున్నార‌ట‌. మ‌రి ఈ ఇబ్బంది నుంచి నాగ‌బాబు ఎలా గ‌ట్టెక్కుతారో చూడాలి.