ఈసారి స్టిల్స్ తో మతి పోగొట్టిన శంకర్!

Sat Nov 17 2018 10:59:22 GMT+0530 (IST)

తమిళ - తెలుగు సినీ ప్రేక్షకులు మాత్రమే కాకుండా యావత్ భారత సినీ అభిమానులు మరియు ప్రపంచంలో ఉన్న ఇండియన్ సినీ ప్రేమికులు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘2.ఓ’. సూపర్ స్టార్ రజినీకాంత్ శంకర్ ల కాంబినేషన్ లో రూపొందిన విజువల్ వండర్ మూవీ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విలన్ గా కనిపించబోతున్న అక్షయ్ కుమార్ సినిమా స్థాయిని అమాంతం పెంచాడు. ఆయన లుక్ సినిమాభిమానుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. మొబైల్స్ రాక్షసుడు అంటూ అంతా కూడా అక్షయ్ పాత్ర గురించి చర్చించుకుంటున్నారు.చిత్రం విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ చిత్రంలోని రజినీకాంత్ - అమీ జాక్సన్ ల స్టిల్స్ ను చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేయడం జరిగింది. గతంలో వచ్చిన ‘రోబో’ చిత్రంలోని రజినీకాంత్ గెటప్ కు ఈ చిత్రంలో గెటప్ కు చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. వసీకర్ మరియు చిట్టి పాత్రల్లో ఈసారి కూడా రజినీకాంత్ మరింత స్టైల్ గా కనిపించనున్నాడని తాజాగా విడుదలైన స్టిల్స్ ను బట్టి అర్థం అవుతుంది. ఒక పాటకు సంబంధించిన ఈ స్టిల్స్ లో రజినీకాంత్ - అమీజాక్సన్   కాస్ట్యూమ్స్ అత్యంత విభిన్నంగా ఉన్నాయి.

శంకర్ సినిమా అంటేనే భారీ సెట్టింగ్స్ కు పెట్టింది పేరు. అలాగే ఈ పాట కోసం కూడా భారీ సెట్ ను నిర్మించినట్లుగా స్టిల్స్ చూస్తే అర్థం అవుతుంది. మొత్తానికి శంకర్ టీజర్ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచి ఇప్పుడు స్టిల్స్ విడుదల చేసి సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచాడు. దాదాపు 600 కోట్లతో లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల కాబోతుంది. ఇప్పటి వరకు నమోదు అయిన ఇండియన్ సినీ రికార్డులన్నీ కూడా ఈ చిత్రం బ్రేక్ చేయబోతుందని ట్రేడ్ వర్గాల వారు గట్టిగా నమ్ముతున్నారు.