Begin typing your search above and press return to search.

ఆస్కార్ మూవీ గ్లాడియేట‌ర్ సీక్వెల్

By:  Tupaki Desk   |   16 Jun 2019 1:30 AM GMT
ఆస్కార్ మూవీ గ్లాడియేట‌ర్ సీక్వెల్
X
అక్క‌డ బానిస‌లు ఒక‌రినొక‌రు క్రూరంగా చంపుకుంటారు. యుద్ధంలో గెలిస్తేనే బ‌తికే హ‌క్కు ఉంటుంది. రారాజులు.. చ‌క్ర‌వ‌ర్తుల‌కు అదో ఆట విడుపు. చంపుకునే ఆట‌ను ఎంతో ఆస్వాధిస్తుంటారు. బానిస‌లైన వీరాధివీరులు కండ‌బ‌లం చూపిస్తూ భీక‌ర‌మైన పోరాటాలు చేస్తుంటే ఆ వినోదం గ‌గుర్పొడుస్తుంది. చ‌రిత్ర‌లో నిక్షిప్త‌మైన ఇలాంటి క‌థ‌ల‌తో సినిమా తీస్తే ప్రేక్ష‌క మ‌హాశ‌యుడు ఏ రేంజులో బ్ర‌హ్మ‌ర‌థం ప‌డ‌తారో గ్లాడియేట‌ర్ సినిమా ప్రాక్టిక‌ల్ గా చూపించింది.

ఒళ్లు గ‌గుర్పొడిచే సాహ‌స‌ విన్యాసాలు.. వార్ సీక్వెన్సుల‌తో తెర‌కెక్కిన గ్లాడియేట‌ర్ (2000 రిలీజ్) ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాదాపు 3200 కోట్లు (460 మిలియ‌న్ డాల‌ర్లు) వ‌సూలు చేయ‌డం ఒక సెన్సేష‌న్ అనుకుంటే అస‌లు వార్ సినిమా అంటే ఈ రేంజులో ఉంటుందో అని భార‌త‌దేశంలో సినీప్రియులు ఆశ్చ‌ర్య‌పోయేలా చేసిన చిత్ర‌మిది. అందుకే రెండు ద‌శాబ్ధాల త‌ర్వాత ఈ సినిమాకి సీక్వెల్ ని ప్ర‌క‌టించ‌డంతో గ్లాడియేట‌ర్ అభిమానుల్లో ఉత్సాహం నెల‌కొంది. ఈ సినిమాని ఎప్ప‌టికి రిలీజ్ చేస్తారు? అన్న ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు.

వార్ సినిమాల్లో ఎంతో ప్ర‌త్యేక‌త ఉన్న చిత్ర‌మిది. ముఖ్యంగా ఈ చిత్రంలో వీరాధివీరుడిగా న‌టించిన ర‌సెల్ క్రో అద్భుత అభిన‌యం ఇప్ప‌టికీ అభిమానుల‌కు గుర్తుంది. రోబ్ సామ్రాజ్యంలో చ‌క్ర‌వ‌ర్తులు బానిస‌ల‌పై సాగించిన అరాచ‌కాల నేప‌థ్యంలో తెర‌కెక్కించిన గ్లాడియేట‌ర్ క‌థ‌కు ఇప్పుడు సీక్వెల్ క‌థ‌ను రాసేందుకు ది టౌన్- 12 స్ట్రాంగ్ చిత్రాల ర‌చ‌యిత పీట‌ర్ క్రెయిగ్ బ‌రిలో దిగారు. రిడ్లీ స్కాట్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మ‌రోసారి ఇదే ద‌ర్శ‌కుడితో క‌లిసి సీక్వెల్ కోసం ప‌ని చేస్తున్నామ‌ని నిర్మాత‌లు వాల్ట‌ర్ ఎఫ్‌.పార్క్స్ - ల్యూరి మెక్ డొనాల్డ్స్ ప్ర‌క‌టించారు. గ్లాడియేట‌ర్ క‌థ ముగిశాక 25-30 ఏళ్ల త‌ర్వాత ఏం జ‌రిగింద‌నేది ఈ సినిమా క‌థాంశంగా ఉంటుంద‌ట‌. 2000 లో రిలీజైన గ్లాడియేట‌ర్ చిత్రానికి 11 విభాగాల్లో ఆస్కార్ కి నామినేట్ అయితే .. ఉత్త‌మ చిత్రం- ఉత్త‌మ న‌టుడు విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకుంది.