Begin typing your search above and press return to search.

ఓపెన్ గా..; రాసేటోళ్ల బాధలు సినిమావోళ్లకు పట్టదే

By:  Tupaki Desk   |   15 May 2016 5:30 PM GMT
ఓపెన్ గా..; రాసేటోళ్ల బాధలు సినిమావోళ్లకు పట్టదే
X
ఎవరి పని వారిది. కానీ.. ఒకరి పనిలోని తప్పుఒప్పుల్ని ఎత్తి చూపటం సినిమా రివ్యూయర్లు చేసే పని. ఇదేమీ ఇప్పుడిప్పుడే మొదలైంది కాదు. ఎన్నో దశాబ్దాలుగా సాగుతున్నదే. ఒక సినిమాను చూసి అందులో బాగున్నది.. బాగోలేని విషయాల్ని ప్రస్తావించటం మామూలే. అయితే.. రివ్యూ రాసినోళ్ల మీద అంతెత్తు ఎగిరిపడటం ఈ మధ్యన చాలామంది సినిమా వాళ్లకు ఓ అలవాటుగా మారింది.

ఈ విషయంలో వారి బాధను కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే.. రివ్యూ రాసేవాడి దృష్టిలో సినిమా అన్నది తాను విశ్లేషించాల్సిన అంశం మాత్రమే. కానీ.. అదే సినిమా.. హీరో నుంచి దర్శకుడి వరకూ అదో బిజినెస్. ఆ సినిమాతో కోట్లాది రూపాయిలు ముడిపడి ఉన్నాయి. రివ్యూ ఏ మాత్రం బాగోలేదన్నా కలెక్షన్లు ఢామ్మని డ్రాప్ కావటం ఖాయం. అందుకే.. రివ్యూల మీద సినీ ప్రముఖులు తరచూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. ఇక్కడ సినీ ప్రముఖులు మర్చిపోతున్న విషయం ఏమిటంటే.. రివ్యూ రాయటంలో ఏ మాత్రం తేడా కొట్టినా సదరు రివ్యూయర్ పుణ్యమా అని మీడియా హౌస్ మీద పడే ప్రభావం చాలా ఎక్కువ. వారి.. విశ్వసనీయతను సైతం దెబ్బ తీస్తుంది. బాగున్న సినిమాను బాగోలేదని రాస్తే.. ఆ రివ్యూ రాసిన మీడియా రివ్యూలను లైట్ తీసుకుంటారు. సినిమా రివ్యూ విషయంలో చిరాకు పడే సినీ ప్రముఖులకు తగ్గట్లే మీడియా సంస్థలుకూడా రివ్యూల విషయంలో కిందామీదా పడుతుంటాయి.

సోషల్ మీడియా జోరు ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో ఏదైనా సినిమాకు సంబంధించిన రివ్యూ విషయంలో ఎక్కువ తక్కువ చేస్తే.. అలా చేసిన మీడియా సంస్థ మీద ఎటకారపు వ్యాఖ్యలు చేసి.. దాని పరువును మొత్తంగా దెబ్బతీసే పరిస్థితి. ఏదైనా సినిమాకు సంబంధించిన రివ్యూను తేడాగా రాస్తే గుర్తించలేనంత దీనస్థితిలో ప్రేక్షకులు లేరన్న విషయాన్ని మర్చపోకూడదు. బాగున్న సినిమాను బాగుందని.. బాగా లేని దానిని బాగోలేదనే చెప్పాల్సిన పరిస్థితి.ఈ విషయంలో ఏ మాత్రం తేడా కొట్టినా అటు సినిమా ప్రొడ్యూస్ చేసిన వాళ్ల నుంచి.. ఇటు ప్రేక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంటుంది. ఒక సినిమా రివ్యూ సరిగా రాలేదంటూ విమర్శించటానికి సినిమా వాళ్లకు అవకాశం ఉంటుంది. మీడియా మీద విరుచుకుపడే వేదికలు ఉంటాయి.

దురదృష్టవశాత్తు తమ మీద పడిన నిందల్ని తుడిచేసుకోవటానికి మీడియా సంస్థలకు వేదిక ఉండదన్న విషయాన్ని మర్చిపోకూడదు. బాగున్నసినిమాను బాగోలేదని రాసేయటం వల్ల మీడియా సంస్థకు ప్రాణ సమానమైతే ‘పాఠకుల విశ్వసనీయత’ పోతుందన్న విషయాన్ని సినిమా వాళ్లు అస్సలు పట్టించుకోరు. ఎవరికి వారు తమ ప్రొడక్ట్ ను ప్రతి మీడియా సంస్థ తెగ పొగిడేయాలన్నట్లే చూస్తారే తప్పించి.. వారి పని వారు చేశారన్నట్లుగా అస్సలు ఫీల్ కారు. నిజానికి.. ఎన్నో మంచిసినిమాలకు తగినంత ప్రచారం లభించకున్నా.. కేవలం రివ్యూల కారణంగా మంచి వసూళ్లు సాధించిన వైనాన్ని మర్చిపోకూడదు. సినిమావాళ్లు అర్జెంట్ గా మార్చుకోవాల్సిన ధోరణి ఏమిటంటే.. తమ దృష్టిలో సినిమా అన్నది వ్యాపారం.కానీ.. రివ్యూలు రాసే వారి దృష్టిలో అదో బాధ్యత. ఎవరో ఒకరిద్దరు ఏదో తప్పు చేశారని రివ్యూలురాసే వాళ్ల మీదా.. రివ్యూ రాసే పని మీద చిన్నచూపుతో చులకన చేసే తీరును మార్చుకుంటే బాగుంటుంది. మన సినిమావాళ్లలో మరీ అంత విశాల హృదయాన్ని కోరుకోవటం అత్యాశే అవుతుందా..?