Begin typing your search above and press return to search.

పుల్లెల గోపీచంద్ తల్లిగా ఆమె

By:  Tupaki Desk   |   25 Aug 2016 8:52 AM GMT
పుల్లెల గోపీచంద్ తల్లిగా ఆమె
X
సరైన టైమింగ్ లో సరైన సినిమా రాబోతోంది. పుల్లెల గోపీచంద్ శిష్యురాలైన పి.వి.సింధు.. రియో ఒలింపిక్స్‌ లో రజతం గెలిచిన నేపథ్యంలో దేశమంతా మన కోచ్ ఘనతల్ని కొనియాడుతున్న సమయంలో గోపీ బయోపిక్ కు రంగం సిద్ధమవుతోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెలుగు-హిందీ భాషల్లో గోపీ బయోపిక్ తెరకెక్కించడానికి బ్యాగ్రౌండ్ వర్క్ జరుగుతోంది. వ్యక్తిగతంగా.. ఆటగాడిగా గోపీతో మంచి పరిచయం ఉన్న సుధీర్ బాబు.. ఆల్రెడీ గోపీచంద్ గా కనిపించడానికి చేయాల్సిన హోమ్ వర్క్ మొత్తం పూర్తి చేశాడు. ప్రస్తుతం ఓవైపు రాజశేఖర్ ప్రధాన పాత్రలో ఓ సినిమా చేస్తూనే.. గోపీ బయోపిక్ కోసం కూడా వర్క్ చేస్తున్నాడు ప్రవీణ్.

గోపీ బయోపిక్ కోసం నటీనటుల ఎంపిక కూడా సమాంతరంగా జరుగుతోంది. ఈ సినిమాలో గోపీ తల్లి పుల్లెల సుబ్బరావమ్మగా సీనియర్ నటి రేవతి కనిపించబోతోంది. గోపీచంద్ ను ఆటగాడిగా తీర్చిదిద్దడంలో.. అతడు అకాడమీ పెట్టాక దాన్ని అన్నీ తానై నడిపించడంలో సుబ్బరావమ్మది కీలక పాత్ర. ఆ పాత్రకు రేవతి లాంటి టాలెంటెడ్ యాక్ట్రెస్ ను తీసుకోవడం తెలివైన నిర్ణయం. ఈ సినిమాలో గోపీ శిష్యురాలు సింధు తన నిజ జీవిత పాత్రలో కనిపిస్తుందని కూడా అంటున్నారు. ఆమె కొన్ని నిమిషాలు తళుక్కుమనే అవకాశముంది. రియో ఒలింపిక్స్ పతకం ప్రస్తావన కూడా వచ్చే అవకాశముంది. వరుసగా స్పోర్ట్స్ బయోపిక్స్ అన్నీ హిట్టవుతున్న నేపథ్యంలో గోపీ బయోపిక్ కూడా ఆ కోవలోకే చేరుతుందేమో చూడాలి.