Begin typing your search above and press return to search.

శ్రీదేవి మరణం.. తెరపైకి దావూద్ పేరు

By:  Tupaki Desk   |   22 May 2018 3:51 PM GMT
శ్రీదేవి మరణం.. తెరపైకి దావూద్ పేరు
X
అతిలోక సుందరి శ్రీదేవి చనిపోయి ఇప్పటికే మూడు నెలలైపోయింది. ఆమె మృతికి సంబంధించి సందేహాలు మాత్రం ఇంకా నివృత్తి కాలేదు. బాత్ రూంలో టబ్ లో పడి ఆమె చనిపోవడమేంటో ఎవరికీ అంతుబట్టలేదు. దీనిపై దుబాయ్ పోలీసుల నుంచి కానీ.. భారత పోలీసు వర్గాల నుంచి కానీ సరైన వివరణే లేదు. కాగా శ్రీదేవి మృతిపై విచారణ జరపాలని ఒక ఫిలిం మేకర్ కోర్టులో కేసు వేయడం.. ఆ సందర్భంగా శ్రీదేవి మీద ఒమన్ దేశంలో రూ.240 కోట్లకు తీసుకున్న జీవిత బీమా గురించి ప్రస్తావించడం.. దుబాయ్ లో చనిపోతేనే ఆ బీమా వర్తించేలా ఉన్న నేపథ్యంలో ఆమె మృతిపై సందేహాలు వ్యక్తం చేయడం సంచలనం రేపింది.

కాగా ఇటీవలే శ్రీదేవి మృతిపై అనేక అనుమానాలున్నాయని.. ఆమెది ప్రణాళిక ప్రచారం జరిగిన హత్య అంటూ ఢిల్లీకి చెందిన మాజీ పోలీసు అధికారి వేద్ భూషణ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన అంతటితో ఆగకుండా ఈ కేసుపై వ్యక్తిగతంగా ఒక బృందంతో విచారణ జరుపుతుండటం విశేషం. ఈ నేపథ్యంలో ఆయన శ్రీదేవి మృతి వెనుక మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం హస్తం ఉందని ఆరోపించడం గమనార్హం. శ్రీదేవి మృతి చెందిన జుమేరా ఎమిరేట్స్ టవర్స్ కు దావూదే యజమాని అని ఆయన పేర్కొన్నారు. శ్రీదేవి మృతి వెనుక రూ.240 కోట్ల బీమా వ్యవహారం ఉండి ఉండొచ్చని వేద్ కూడా ఆరోపించడం గమనార్హం. శ్రీదేవి మృతిపై పునర్విచారణ జరపాలని తాను సుప్రీం కోర్టులో పిటిషన్ వేయబోతున్నట్లు వేద్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ఈ కేసు మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.