Begin typing your search above and press return to search.

చిరు 150లో రెజీనా.. షరతులు వర్తించును

By:  Tupaki Desk   |   5 May 2016 4:44 PM GMT
చిరు 150లో రెజీనా.. షరతులు వర్తించును
X
చిరంజీవి లాంటి స్టారాధి స్టారుడికి హీరోయిన్ల విషయంలో ఇబ్బంది ఎదురవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా..? కానీ తప్పట్లేదు. ఇప్పుడున్న స్టార్ హీరోయిన్లలో చాలామంది చిరు పక్కన చిన్నపిల్లల్లా కనిపిస్తారు. కాస్త వయసు ఎక్కువున్న హీరోయిన్లలో క్రేజ్ ఉండి.. అందుబాటులో ఉన్నవాళ్లు తక్కువమంది. ఆ తక్కువమందిలోంచి అతి కష్టం మీద నయనతారను ఫైనలైజ్ చేశాడు దర్శకుడు వి.వి.వినాయక్.

ఐతే చిరు-150లో నయన్‌ తో పాటు ఇంకో హీరోయిన్ కు చోటుందన్నది తాజా సమాచారం. ఆ లేడీ మరెవరో కాదు.. సాయిధరమ్ తేజ్ తో వరుసగా రెండు సినిమాలు చేసి మెగా హీరోయిన్ గా ముద్ర పడిన రెజీనా. ఐతే మేనల్లుడి పక్కన హీరోయిన్ గా నటించిన అమ్మాయిని చిరంజీవి పక్కన హీరోయిన్ గా పెడతారా..? అందుకు చిరంజీవి ఒప్పుకుంటాడా..? అన్న డౌట్లు లేకపోలేదు.

ఐతే రెజీనా చిరు పక్కన హీరోయిన్ గా నటించట్లేదట. కేవలం ఒక ఐటెం సాంగ్ మాత్రమే చేస్తుందట. ఇలా అయితే ఎవరికీ ఏ అభ్యంతరాలు కూడా ఉండవులెండి. నిజానికి ‘కత్తి’ ఒరిజినల్‌ లో హీరోది డబుల్ రోలే అయినా.. ఇద్దరు హీరోయిన్లు ఉండరు. సమంత ఒక్కత్తే హీరోయిన్. వేరే ఐటెం సాంగ్స్ కూడా ఏమీ ఉండవు. ఐతే తెలుగుకు వచ్చేసరికి చిరంజీవి రీఎంట్రీ మూవీలో ఒక్క హీరోయిన్ కు పరిమితం అయిపోతే బాగోదని.. ఏదైనా హైలైట్ కూడా ఉండాలని ఐటెం సాంగ్ సెట్ చేశారు. మరి కెరీర్లో తొలిసారి ఐటెం సాంగ్.. అది కూడా మెగాస్టార్ సినిమాలో చేయబోతున్న రెజీనా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.