రెజీనా సైడ్ తీసుకుందా

Sun May 20 2018 16:54:19 GMT+0530 (IST)

కొందరికి ఎంత టాలెంట్ ఉన్నా టైం కలిసిరాకపోతే ఎక్కడ ఉన్న కెరీర్ అక్కడే ఉన్న తీరుగా మిగులుతారు. సౌత్ సినిమాకు 2005లోనే పరిచయమైనా ఇప్పటి దాకా రెజీనా  టాప్ 5 హీరోయిన్ లీగ్ లోకి చేరుకోలేకపోయింది. సుధీర్ బాబు శివ మనసులో శ్రుతి  ద్వారా ఎంట్రీతోనే సక్సెస్ అందుకున్న రెజీనా తర్వాత దాన్ని అలాగే కొనసాగించలేకపోయింది. గత ఏడాది చేసిన నక్షత్రం-బాలకృష్ణుడు ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్ కావడంతో పాటు అ!!లో ఎంత వైవిధ్యమైన పాత్ర చేసినప్పటికీ అందులో హీరోయిన్లు ఎక్కువగా ఉండటంతో తనకు దక్కిన షేర్ తక్కువే. అందుకే గత నాలుగేళ్లుగా తనకు ఎక్కువ అవకాశాలను ఇస్తున్న కోలీవుడ్ ను నమ్ముకోవడానికే డిసైడ్ అయినట్టుగా కనిపిస్తోంది. అందుకు కారణం లేకపోలేదు. నక్షత్రం సినిమాలో అందాల ఆరబోత చేసినా మనవాళ్ళు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో తెలుగు సినిమాలకు స్వస్తి చెప్పి ఇతర భాషల మీదే ఎక్కువ ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకుందట.ప్రస్తుతం రెజీనా తమిళ్ లో మిస్టర్ చంద్రమౌళి అనే సినిమా ఒకటి చేస్తోంది. గౌతమ్ కార్తిక్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ ట్రైలర్ లో రెజీనా ఎక్స్ పోజింగ్ చూసి మనవాళ్ళు కూడా ఔరా అన్నారు. దీంతో పాటు హిందీలో ఎక్ లడ్కీకో దేఖాతో ఐసా లాగా అనే సినిమా చేస్తున్న ఈ రెండింటి రిజల్ట్ పట్ల చాలా ధీమాగా ఉంది. రెజీనాతో పాటు ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా నటిస్తోంది. టైటిల్ రోల్ మాత్రం గౌతమ్ ది కాదు. ఇందులో అతనితో పాటు నటిస్తున్న నిజ జీవిత తండ్రి సీనియర్ హీరో  కార్తీక్ ది. దీని మీద అక్కడ బాగానే హైప్ ఉంది. ఇది కనక బ్రేక్ ఇస్తే మరో ఐదేళ్లు తమిళ్ లోనే సెటిల్ అయిపోవచ్చు అనేది రెజీనా ప్లాన్ లా కనిపిస్తోంది. అందుకే తెలుగుకి సైడ్ ఇచ్చేసి చెన్నయ్ లో మకాం పెట్టే ఆలోచనలో రెజీనా ఉన్నట్టు కోలీవుడ్ టాక్. అంతే మరి. ఎక్కడ దీపం ఉంటే అక్కడ కెరీర్ చక్కదిద్దుకోవడమేగా ఇప్పటి హీరోయిన్ల ఫార్ములా. రెజీనా కూడా అదే ఫాలో అవుతోంది. అంతే.