Begin typing your search above and press return to search.

అసలు మెగా ఫ్యామిలీతో వర్మ గొడవేంటి?

By:  Tupaki Desk   |   21 April 2018 8:36 AM GMT
అసలు మెగా ఫ్యామిలీతో వర్మ గొడవేంటి?
X
రామ్ గోపాల్ తాను పవన్ కళ్యాణ్ కు వీరాభిమానిని అని చెబుతుంటాడు. కానీ గత కొన్నేళ్లలో పవన్ కళ్యాన్ ను ఆయన టార్గెట్ చేసినంతగా ఇంకెవ్వరూ చేసి ఉండరేమో. ‘అదుర్స్’ సినిమాలో గురువు గారూ గురువు గారూ అంటూనే.. అన్న డైలాగ్ తరహాలో అభిమాని అభిమాని అంటూనే పవన్ కళ్యాణ్ ను ఎన్నిసార్లు విమర్శించాడో.. ఎంతగా గాలి తీసే ప్రయత్నం చేశాడో అందరికీ తెలిసిందే. కేవలం పవన్ ను మాత్రమే కాదు.. చిరంజీవిని కూడా పలుమార్లు లక్ష్యంగా చేసుకున్నాడు వర్మ. ఆయన నేరుగా విమర్శిస్తున్నట్లుగా అనిపించదు. కానీ మెగా ఫ్యామిలీపై పరోక్షంగానే సెటైర్లు గుప్పిస్తూనే ఉంటాడు. తాజాగా శ్రీరెడ్డితో పవన్ ను బూతు తిట్టించడంతో వర్మ ఉద్దేశాలు వేరే అన్న అభిప్రాయాలు కలిగాయి అందరికీ.

ఈ నేపథ్యంలో వర్మకు.. మెగా ఫ్యామిలీకి అసలేంటి గొడవ అనే చర్చ మొదలైంది. రాజకీయ ప్రత్యర్థులెవరైనా చిరంజీవిని.. పవన్ ను విమర్శిస్తే ఓకే కానీ.. ఏ సంబంధం లేని వర్మ ఎందుకు వాళ్లను టార్గెట్ చేస్తున్నారనే చర్చ నడుస్తోంది. ఒకప్పుడు దేశంలోనే అత్యుత్తమ దర్శకుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు వర్మ. గత పదేళ్ల ట్రాక్ రికార్డు తీసేస్తే.. అంతకుమందు దర్శకుడిగా వర్మ స్థాయి ఏంటో అందరికీ తెలిసిందే. అయినప్పటికీ మెగా ఫ్యామిలీ హీరోలెవ్వరూ వర్మతో సినిమాలు చేయలేదు. చిరంజీవితో ఒక సినిమా మొదలుపెట్టాడు కానీ.. అది అర్ధంతరంగా ఆగిపోయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వర్మ చెప్పిన ఒక కథ విని తిరస్కరించాడని అంటారు. ఐతే ఈ విషయాల్ని దృష్టిలో పెట్టుకుని మెగా ఫ్యామిలీని వర్మ టార్గెట్ చేస్తున్నాడా అంటే కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే వర్మ ఆ తరహా మనిషిలా కనిపించడు. పైగా చిరుతో చేయాల్సిన సినిమా నుంచి వర్మే తప్పుకున్నాడు. వర్మ కథల్ని పవన్ మాత్రమే కాదు.. ఎంతోమంది తిరస్కరించి ఉండొచ్చు. అలా అని అందరి మీదా కక్ష కట్టగలడా? మరి ఇవి కాకుండా మెగా ఫ్యామిలీని వర్మ లక్ష్యంగా చేసుకోవడానికి కారణాలేమున్నాయో వాళ్లకు వాళ్లకే తెలియాలి.