శ్రీరెడ్డికి వాళ్ల సపోర్ట్ లేదెందుకు?

Tue Apr 17 2018 11:52:04 GMT+0530 (IST)

తెలుగునాట శ్రీరెడ్డి ఒక సంచలనం. ఎవరూ నోరు విప్పేందుకు ఇష్టపడని క్యాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ గా మాట్లాడేయటమే కాదు.. అవకాశాల కోసం తాను అందరి చేతిలో మోసపోయిన విషయాన్ని చెప్పేసింది. మోసపోయిన అమ్మాయిని చూసిన వారు జాలి పడటం.. అయ్యో అనటం మామూలే.దీనికి తగ్గట్లే శ్రీరెడ్డి ఉదంతంలోనూ.. మొదట్లో ఆమెకు ఈ తరహాలోనే మద్దతు లభించింది. ఆమె మాదిరి టీవీల ముందుకు రాకున్నా.. ఓపెన్ గా మాట్లాడలేని వారు పలువురు శ్రీరెడ్డికి తెర వెనుక మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళుతున్న శ్రీరెడ్డిలో కాన్ఫిడెన్స్ లెవల్స్ అంతకంతకూ పెరిగిపోవటమే కాదు.. తానేం అన్నా.. తనకు ఎదురు చెప్పే ధైర్యం చేయలేరన్న భావన వచ్చినట్లుగా కనిపిస్తోంది.

నిజాయితీగా సమస్య మీద పోరాడినప్పుడు అండగా నిలిచేందుకు నలుగురు వస్తారు. కానీ.. సమస్య పేరుతో కొత్త తరహాలో ఆమె మొదలు పెట్టిన పోరాటం ఇప్పుడు అందరూ తప్పు పట్టేలా చేస్తోంది. సామాజిక సేవ చేయాలనే వారు సమస్యల మీద ఫైట్ చేస్తారే కానీ.. సంబంధం లేని వ్యక్తుల మీద ఫైట్ చేయరు. నిన్నటి వరకూ సినీ రంగంలోని క్యాస్టింగ్ కౌచ్ అంతానికి వ్రతం పూనినట్లు వ్యవహరించిన శ్రీరెడ్డి తాజాగా కొత్త తరహాలో వ్యవహరించటంపై పలువురు తప్పు పడుతున్నారు.

సామాజిక కార్యకర్తలుగా పని చేస్తున్న సినిమా వాళ్లు లేకపోలేదు. రియల్ టైంలో వారు చేస్తున్న కార్యక్రమాలపై ఇప్పటికే ఎంతో మంచిపేరును సంపాదించుకున్న వారు లేకపోలేదు. అక్కినేని నాగార్జున సతీమణి.. సామాజిక కార్యకర్త అమల సంగతే చూస్తే.. మూగజీవాలపై ఆమె చేస్తున్న సేవను ఎవరు మాత్రం తప్పు పట్టగలరు?  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రోజా సంగతే చూస్తే.. సినిమా పరిశ్రమకు సంబంధించిన సమస్యలే కాదు.. సామాజిక.. రాజకీయ అంశాల పైనా ఆమె పని చేస్తున్నారు. వీరిద్దరే కాదు లక్ష్మీ మంచు.. జీవితా రాజశేఖర్ ఇలా చెప్పుకుంటే చాలామందే ఉన్నారు.

వీరిలో ఎవరూ కూడా శ్రీరెడ్డికి అండగా నిలిచిన వాళ్లు లేకపోవటం గమనార్హం. అండగా నిలవటం తర్వాత కనీసం మద్దతు పలుకుతున్నట్లుగా ఒక్క మాట కూడా చెప్పటం లేదు. ఎందుకిలా అంటే.. చాలా కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. మొదట్లో టాలీవుడ్ లోని వికృత పార్శమైన క్యాస్టింగ్ కౌచ్ ను ప్రస్తావించిన శ్రీరెడ్డి.. ఇప్పుడు వ్యక్తుల్ని లక్ష్యంగా చేసుకుంటూ ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేయటాన్ని తప్పు పడుతున్నారు. తప్పుల్ని ఎత్తి చూపటం వరకూ ఓకే కానీ.. ప్రముఖుల్ని వేలెత్తి చూపిస్తూ అంతకంతకూ అన్ని మర్చిపోతున్న  వైనం శ్రీరెడ్డి మాటల్ని చూస్తే ఇట్టే అర్థమవుతందిన సమస్యను వదిలి వ్యక్తుల్ని టార్గెట్ చేయటం మొదలెట్టినంతనే సమస్య పరిష్కారం సంగతి తర్వాత పక్కదారి పట్టటంమాత్రం  ఖాయం. ఆ విషయాన్ని శ్రీరెడ్డి గుర్తు చేసుకుంటే మంచిదని చెబుతున్నారు.