బోనీకపూర్ ను శ్రీదేవి ఎందుకు పెళ్లి చేసుకున్నారు?

Sun Feb 25 2018 09:52:59 GMT+0530 (IST)

అతిలోక సుందరిగా కీర్తి ప్రతిష్ఠలు అందుకొని.. అభిమానుల మనుసుల్లో అలానే నిలిచిపోతూ తన దారిన తాను వెళ్లిపోయారు శ్రీదేవి. ఆమె గురించి తెలిసిన వారంతా ఇప్పుడామె లేరనే షాక్ లో ఉండిపోయారు. శ్రీదేవి మరణవార్త ఆమె గురించి మరోసారి గుర్తుకుతెచ్చుకునేలా చేసింది.అరవై.. డెబ్భైల్లో పుట్టిన వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ.. కొత్త తరానికి మాత్రం శ్రీదేవికి సంబంధించి కొత్త డౌట్లు వస్తుంటాయి. తిరుగులేని నటిగా.. టాలీవుడ్.. బాలీవుడ్.. కోలీవుడ్.. శాండిల్ వుడ్ లలో తన సత్తా చాటి.. అగ్ర నటీమణుల్లో ఉన్న శ్రీదేవి వివాహం బోనీకపూర్ తో ఎందుకు జరిగింది?

 అప్పటికే పెళ్లై.. పిల్లల తండ్రి అయిన బోనీకపూర్ ను శ్రీదేవి ఎందుకు ఎంపిక చేసుకున్నారు? అన్న సందేహం రాక మానదు. నిజానికి శ్రీదేవి పెళ్లి అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించింది. శ్రీదేవి పెళ్లి మీద బోలెడన్ని వార్తలు వచ్చేవి. ఆమె కోసం చాలామంది క్యూ కట్టేవారన్న వార్తలు వచ్చేవి. అలాంటి వేళ.. హటాత్తుగా బోనీకపూర్ ను పెళ్లాడినట్లుగా వచ్చిన వార్త అప్పట్లో సన్సేషనల్.

వృత్తిపరంగా తిరుగులేని స్థానంలో ఉన్న శ్రీదేవి వ్యక్తిగత జీవితం మాత్రం సాఫీగా సాగలేదని చెబుతారు. అగ్రశ్రేణి నటిగా ఉన్నప్పటికీ.. తల్లి మరణం తర్వాత ఆమె మరింతగా కుంగిపోయారు. ఒంటరిగా ఫీలయ్యారు. అలాంటి వేళ.. కపూర్ ఫ్యామిలీలోకి అడుగు పెట్టారు. అప్పటికే అగ్రశ్రేణి నిర్మాతగా పేరున్న బోనీకపూర్ తో పెళ్లికి ఓకే చెప్పారు. నిజానికి శ్రీదేవి పెళ్లి నిర్ణయాన్ని అప్పట్లో ఆమె అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోయారని చెబుతారు.

పెళ్లై.. పిల్లలున్న బోనీకపూర్ ను ఎందుకు ఆమె పెళ్లాడారా? అన్న ప్రశ్న మీద అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. తానున్న పరిస్థితుల్లో బోనితో పెళ్లి బాగుంటుందన్న నిర్ణయంగా చెబుతుంటారు. మరోవైపు.. వీరి పెళ్లిపై బోనీకపూర్ మొదటి భార్య మోనా కపూర్ అప్పట్లో చెప్పిన మాటేమిటంటే.. పెళ్లికి ముందు శ్రీదేవితో బోనీకపూర్ కు సంబంధం ఉందని.. ఆయన కారణంగా శ్రీదేవి గర్భవతి అయ్యారని.. అందుకే పెళ్లాడారని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

శ్రీదేవి పెళ్లి వ్యవహారం సంచలనంగా మారినా.. ఆమె వైవాహిక జీవితం మాత్రం ఎలాంటి లోటు లేకుండా సాగిందనే చెప్పాలి. ఇద్దరు పిల్లలతోనూ.. బోనీకపూర్ మొదటి భార్య పిల్లలతోనూ శ్రీదేవి సామరస్యంగా ఉండటమే కాదు.. కపూర్ కుటుంబంలో ఆమె అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్నట్లు చెబుతారు.