Begin typing your search above and press return to search.

రుద్రమదేవికి కొత్త కష్టమొచ్చింది

By:  Tupaki Desk   |   27 Aug 2015 3:54 PM GMT
రుద్రమదేవికి కొత్త కష్టమొచ్చింది
X
ఓ భారీ బడ్జెట్ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ కాకపోతే వచ్చే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. బడ్జెట్ మొత్తం ఫైనాన్స్ ద్వారా సమకూర్చుకున్నదే అయి ఉంటుంది కాబట్టి.. రోజులు గడిచే కొద్దీ వడ్డీల భారం పెరిగిపోతూ ఉంటుంది. మరోవైపు వాయిదాల పడే కొద్దీ ప్రేక్షకుల్లో ఆసక్తీ తగ్గిపోతుంది. వాయిదాల మీద వాయిదాలు పడే సినిమాలు హిట్ కావన్న ఓ సెంటిమెంటు కూడా ఏడ్చింది. ఇన్ని ప్రతికూలతలుంటాయి కాబట్టే విడుదల వాయిదా పడుతుంటే నిర్మాత గుండెల్లో రైళ్లు పరుగెడుతుంటాయి. దర్శకుల మీద బాగా ఒత్తిడి తెస్తుంటారు. ఐతే ‘రుద్రమదేవి’ విషయంలో దర్శకుడు, నిర్మాత గుణశేఖరే. రుద్రమదేవి ఇలా పదే పదే వాయిదా పడ్డానికి బాధ్యుడు అతడే. ఇలా ఓ సినిమాను వాయిదాల మీద వాయిదాలు వేస్తుంటే జనాలకు బాగా కోపం వస్తుంది కానీ.. గుణ పడ్డ కష్టం గుర్తుకొచ్చి అతడి మీద జాలే చూపిస్తున్నారు జనాలు.

సెప్టెంబరు 4న ఖాయం అనుకున్న సినిమా కాస్తా వాయిదా పడి.. తర్వాతి రిలీజ్ డేట్ విషయంలో తలనొప్పులు ఎదుర్కొంటోంది. 4న అయితే ఏ సమస్యా ఉండేది కాదు. కానీ తర్వాత ఏ డేట్ అనుకున్నా కష్టమే అన్నట్లుంది. అనేక తర్జన భర్జనల అనంతరం సెప్టెంబరు 17న రిలీజ్ డేట్ ఫిక్స్ చేద్దామని చూశాడు గుణ. కానీ ఇక్కడే ఓ పెద్ద సమస్య వచ్చి పడింది. తమిళంలో విజయ్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ మూవీ ‘పులి’ ఆ రోజే విడుదల కాబోతోంది. దీంతో ఆ రోజు విడుదల వద్దంటూ తమిళ డిస్ట్రిబ్యూటర్ అడ్డం పడ్డాడట. ఐతే తమిళ వెర్షన్ కోసమని రాజీ పడితే గుణశేఖర్ కు మళ్లీ సరైన డేటు దొరికే అవకాశం లేదు. నవంబరుకు గానీ సినిమాను విడుదల చేసుకోలేడు. అలాగని తెలుగు వెర్షన్ ముందు రిలీజ్ చేసి.. తర్వాత తమిళంలో రిలీజ్ చేద్దామంటే భారీ మొత్తానికి ‘రుద్రమదేవి’ హక్కులు తీసుకున్న తమిళ డిస్ట్రిబ్యూటర్ అందుకు ఒప్పుకునే ప్రసక్తే లేదంటున్నాడు. ఏదో ఒకటి చేసి సెప్టెంబరు 4న రిలీజ్ చేసుకుని ఉంటే.. అంతా సవ్యంగా సాగిపోయేది. కానీ కారణాలేంటో కానీ వాయిదా వేసేశాడు. ఇప్పుడు గుణశేఖర్ ఏం చేస్తాడో చూడాలి.