Begin typing your search above and press return to search.

ఫోటోతో జ‌క్క‌న్న సైలెంట్ రిటార్ట్!

By:  Tupaki Desk   |   20 Nov 2017 4:36 AM GMT
ఫోటోతో జ‌క్క‌న్న సైలెంట్ రిటార్ట్!
X
ఎలాంటి కామెంట్ లేకుండా ఒక ఫోటోతో భారీ సంచ‌ల‌నం సృష్టించారు జ‌క్క‌న్న‌. అది కూడా పాజిటివ్ గానే. సోష‌ల్ మీడియా వ‌చ్చాక సినీ ప్ర‌ముఖులు.. సెల‌బ్రిటీలు ఏదో ఒక వ్యాఖ్య చేయ‌టం వివాదానికి తెర తీయ‌టం చూస్తున్న‌దే. జ‌క్క‌న్న మాత్రం అందుకు భిన్నంగా ఉంటారు. అయితే గియితే మెచ్చుకోలు.. మ‌న‌సుకు ద‌గ్గ‌రైతే పొగ‌డ్త‌ల కోసం వాడ‌తాడే త‌ప్పించి అన‌వ‌స‌ర‌మైన వివాదాలు సృష్టించేందుకు సోష‌ల్ మీడియాను అస్స‌లు వాడ‌డు.

అలాంటి జ‌క్క‌న్న ఎలాంటి సౌండ్ లేకుండా ఒక ఫోటోను పోస్ట్ చేయ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. బాహుబ‌లి 2 త‌ర్వాత త‌న త‌ర్వాతి ప్రాజెక్టును ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌క‌టించ‌లేదు. రాజ‌మౌళి చేసే సినిమా మీద భాష‌ల‌కు అతీతంగా యావ‌త్ సినిమా ఇండ‌స్ట్రీ ఆస‌క్తిగా ఉంది.

అలాంటి వేళ త‌న‌కు ఒక ప‌క్క‌న జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. మ‌రోప‌క్క‌న రాంచ‌ర‌ణ్ ల‌తో కూడిన ఫోటోను పోస్ట్ చేయ‌టంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తుంది. ఫోటోను చూసిన చాలామంది ఈ ఇద్ద‌రితో క‌లిసి భారీ మ‌ల్టీస్టార‌ర్ ఫిలింను చేస్తున్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రిగింది.

రాజ‌మౌళి ప‌క్క‌న కులాసాగా.. స‌న్నిహితంగా .. మాంచి హ్యాపీ మూడ్ లో ఉన్న చెర్రీ.. ఎన్టీఆర్ ల ఫోటోను పోస్ట్ చేయ‌టం సంచ‌ల‌నంగా మారింది. ఇద్ద‌రి కాంబినేష‌న్లో మూవీ అంటూ వైర‌ల్ అయ్యింది. కానీ.. ఫోటో పోస్ట్ చేసి రోజు గ‌డిచినా ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ ఫోటో మీద రియాక్ట్ అయ్యింది లేదు. ఫోటో పోస్ట్ చేసేసి అంద‌రిలో ఆస‌క్తిని పెంచేయ‌ట‌మే కాదు.. జ‌క్క‌న్న నోట్లో నుంచి మ‌రెలాంటి మాట రాక‌పోవ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇదిలా ఉంటే.. మ‌రోవైపు ఈ సంచ‌ల‌న కాంబినేష‌న్లో మూవీకి సాధ్యాసాధ్యాల లెక్క చూస్తే.. ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కూ ఈ ఇద్ద‌రు హీరోలు ఖాళీగా లేరు. అలాంట‌ప్పుడు జ‌క్క‌న్న పోస్ట్ చేసిన ఫోటో మాటేమిటి? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ఈ ఫోటోను సినిమా యాంగిల్ లో కాకుండా మ‌రోలా ఆలోచిస్తే ఆస‌క్తిక‌ర కోణం క‌నిపిస్తోంది. ఏపీ స‌ర్కారు ప్ర‌క‌టించిన నంది అవార్డులు వివాదాస్ప‌దం కావ‌టం.. ఇండ‌స్ట్రీ మొత్తం క‌మ్మ‌.. కాపు అంటూ హోరెత్తిపోతోంది.

దీనికి మీడియా కూడా కొంత కార‌ణంగా మారింద‌ని చెప్పాలి. ఈ నేప‌థ్యంలో త‌న ఫోటోతో సైలెంట్ సందేశాన్ని రాజ‌మౌళి ఇచ్చారా? అన్న‌ది సందేహం. అంద‌రూ అనుకున్న‌ట్లుగా క‌మ్మ‌.. కాపు అంటూ కులాల పంచాయితీ త‌మ మ‌ధ్య‌న లేద‌నే మాట‌ను స్ప‌ష్టం చేయ‌టం కోస‌మే జ‌క్క‌న్న ఈ ఫోటోను పోస్ట్ చేశారా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌. ఈ వాద‌న‌ను కొంద‌రు ఏకీభ‌విస్తున్నారు. ఎందుకంటే.. ఆ మ‌ధ్య‌న రాజ‌మౌళి మీద కూడా ట్విట్ట‌ర్ లో కుల ముద్ర వేయ‌టం మ‌ర్చిపోకూడ‌దు. ఆ త‌ర్వాత నుంచే అన్ని సినిమాల మీదా ట్వీట్లు చేయ‌టం షురూ చేశారు జ‌క్క‌న్న‌. నంది అవార్డుల వివాదం నేప‌థ్యంలో త‌న సందేశాన్ని ఫోటో రూపంలో జ‌క్క‌న్న పంపారా?