Begin typing your search above and press return to search.

కామెంట్‌: కబాలి ఎందుకు తీశారో..

By:  Tupaki Desk   |   25 July 2016 10:30 PM GMT
కామెంట్‌: కబాలి ఎందుకు తీశారో..
X
మలేషియాలో డాన్ లు అంటే మనం దాదాపు ప్రతీ సినిమాలోనూ చూస్తున్నాం. వెంకీ షాడో అయినా.. ప్రభాస్‌ బిల్లా అయినా.. మలేషియాలోనే డాన్లు. అసలు అక్కడే డాన్లు ఎందుకు ఉంటారు? ఆ దేశంలో డ్రగ్‌ ట్రాఫికింగ్ నేరం కదా.. ఉరి శిక్షలు పడతాయి కదా.. మరి కబాలి వంటి డాన్లు అక్కడే ఎందుకు పుట్టుకొస్తారు? ఈ విషయంపై చాలా పెద్ద నిజం ఒకటి తెలుస్తోంది.

నిజానికి మలేషియాలో ఇంకా గ్యాంగ్ కల్చర్ ఉన్నమాట వాస్తవమే. చైనీస్ గ్యాంగ్స్ ఒకవైపు అయితే.. ఇండియాన్ గ్యాంగ్ మరోవైపు. ఇప్పటికీ అక్కడ చైనీస్ వారికి చెందిన గ్యాంగ్ 8.. అలాగే ఇండియన్స్ కు చెందిన గ్యాంగ్ 36 బాగానే ఫేమస్. అయితే పోలీసులు అన్ని విషయాలనూ గమనిస్తూనే ఉంటారట. ఎవరన్నా తేడా చేస్తే ప్రత్యేక చట్టం పరిధిలో వారిని లోపల వేసేస్తారని తెలుస్తోంది. అక్కడి భారతీయ సంతతి అంతా.. ఇండియా నుండి బ్రిటీషు కాలంలో అక్కడి తోటల్లో పనిచేయడానికి వెళ్ళిన జనాభా. కాని వీరిని ఇంకా అక్కడ మలయ్‌ జాతిగా మాత్రం గుర్తించట్లేదు. దానితో ఈ భారతీయ సంతతికి ప్రభుత్వం అందించే సాయం నుండి జాబ్స్ వరకు.. ఏదీ దక్కదు. కేవలం కొంతమంది మాత్రమే బాగా సెటిల్ అయితే.. మిగిలిన వారందరూ 10వ తరగతితో ఆపేసి.. ఇలా గ్యాంగ్స్ లో చేరుతుంటారట. దాదాపు ఇండియన్ సంతతి వారిని చూస్తేనే.. గ్యాంగ్ స్టర్ అనే అనుమానం ఉంటుందట అక్కడి వారికి. పైగా వీరందరూ మాట్లాడే తమిళం కూడా.. 100 సంవత్సరాల క్రితం తమిళ్. ఇప్పటి యాస కాదు. ఇప్పుడు చెన్నయ్ లో మాట్లాడే యాస వారికి సరిగ్గా అర్ధం కాదు కూడా. ఇకపోతే ఈ ఇండియన్స్ లోనే.. కులాలకు అతీతంగా పెళ్లిళ్లు అనేవి ఒక 15 సంవత్సరాల నుండే వచ్చాయట. అంతకుముందు.. ఎవరి కులంలో వారే చేసుకునేవారట. తేడా వస్తే.. ఏటు పడేదేంతే.

ఇక ''కబాలి'' సినిమాలో మొత్తంగా చూపించింది ఇదే. కబాలి జైలు నుండి విడుదలవుతాడు. అంటే ప్రత్యేక చట్టంలో ఖైదు చేయబడ్డ ఇండియన్ గ్యాంగ్ హెడ్ ఆయన. అలాగే సినిమాలో కబాలి చుట్టాల పిల్లలు ఇద్దరు.. ఉద్యోగాలు లేవు మీతో వచ్చేస్తాం అంటూ గ్యాంగులో చేరతారు. చిన్నప్పుడే డ్రగ్స్ వాడుతున్న స్కూల్ పిల్లలు.. చైనీస్ గ్యాంగ్ స్టర్స్.. ఇవన్నీ మలేషియాలో ఉన్న నిజాలే. వాటినే కబాలిలో చూపించారు. అంతేకాదు.. చాలా చోట్ల మలేషియన్ తమిళ యాసనే వాడారు. కాఫీ షాపుల్లో గ్యాంగు మీటింగులూ.. ఫ్యాక్టరీలలో డ్రగ్స్.. ఇవన్నీ కూడా రియలిస్టిక్ సిట్యుయేషన్ల నుండి తీసుకున్నవే. అంతే కాకుండా అక్కడ ఒకరి గుళ్ళను ఒకరు పడగొట్టడం.. ఇవి కూడా ఎక్కువే. అది కూడా కబాలి సినిమాలో ఓ సీన్లో ఉంటుంది. అలాగే కబాలి కూడా.. కులం పేరు ప్రస్తావించకుండా.. వేరే కులపు అమ్మాయిని చేసుకున్నాడనే చెబుతారు. దర్శకుడు పా.రంజిత్ అసలు ఈ మలేషియా వాతావరణంలో సినిమా ఎందుకు తీయలనుకున్నాడో తెలియదు. ఒకవేళ అక్కడున్న ఇండియన్ గ్యాంగులన్నీ మంచివే అని చెప్పడానికా? లేకపోతే వారి దుస్థితిని ప్రపంచానికి చూపెట్టడానికా?

సినిమా క్లయమ్యాక్స్ లో మలేషియా పోలీసులకు లొంగిపోయిన కబాలి అంటూ మలేషియన్‌ వర్షెన్ లో రాత పూర్వకంగా చెప్పారన్న విషయం తెలిసిందే. ఇది అక్కడి పోలీసుల కోసం వేశారట. ఎందుకంటే అలా వేయకపోతే.. కబాలిని పెద్ద హీరో అని చూపిస్తే.. బయటకొచ్చి ఇంతమందిని చంపేసి హ్యాపీగా మలేషియాను ఏలేస్తున్నాడు అని చూపిస్తే.. అది పోలీసులను అవహేళన చేశారని ఫీలైయ్యి.. ఏదో స్పెషల్‌ చట్టం పేరు చెప్పి 'కబాలి' సినిమాను మలేషియాలో బ్యాన్ చేసుండేవారు.

అసలు ఇంత రీసెర్చ్ చేసి.. చివరకు మలేషియా పోలీసులకు భయపడుతూ.. వారిని ఎక్కడా తక్కువగా చూపకుండా.. ఈ సినిమా ఎందుకు తీయాల్సి వచ్చిందో?