Begin typing your search above and press return to search.

బండ్ల గణేష్ రాజకీయాలు ఎందుకు వదిలేశాడు?

By:  Tupaki Desk   |   21 April 2019 11:38 AM GMT
బండ్ల గణేష్ రాజకీయాలు ఎందుకు వదిలేశాడు?
X
ఆరు నెలల కిందట బండ్ల గణేష్ రాజకీయారంగేట్ర సమయంలో ఎంత హడావుడి జరిగిందో తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నప్పటికీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మీడియాలో గణేషే ఎక్కువ హైలైట్ అయ్యాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బండ్ల చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఇంకా టికెట్ ఖరారు కాకముందే టీవీ స్టూడియలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కూడాా చేసేశాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుంటే 7 ఓ క్లాక్ బ్లేడుతో గొంతు కూడా కోసుకుని చనిపోతా అన్నాడు. ఇంత హడావుడి చేసిన వాడు.. అరంగేట్రం చేసిన ఆరు నెలలకే రాజకీయాలకు గుడ్ బై చెప్పేశాడు. ఇటీవలే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు బండ్ల ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరి ఇంత త్వరగా బండ్ల ఎందుకు రాజకీయాల నుంచి తప్పుకున్నాడు? అప్పుడే అతడికి రాజకీయాలపై అంత వ్యతిరేకత ఎందుకు ఏర్పడింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఇవే విషయాలు ప్రస్తావిస్తే ఆసక్తికర సమాధానం ఇచ్చాడు బండ్ల. ‘‘ఇక్కడ పొదుగులు కోసేస్తారు. ఇంజక్షన్ కూడా ఇవ్వరు. నొప్పితో అల్లాడి పోవాలి. పొదుగులు కోసినట్లు మనకు కూడా తెలియదు. వాష్ రూంకు వెళ్లిన తర్వాతే అర్థమవుతుంది. ఇదీ రాజకీయం అంటే’’ అంటూ వేదాంత ధోరణిలో మాట్లాడాడు బండ్ల. తన లాంటి వాడు రాజకీయాలకు పనికి రాడని.. ఇక్కడ నెగ్గుకు రావడం మామూలు విషయం కాదని.. రాజకీయాల్లోకి వచ్చి తాను తప్పు చేశానని తర్వాత అర్థమైందని బండ్ల వ్యాఖ్యానించాడు. ఐతే ఇది ఆ ఇంటర్వ్యూ తాలూకు ప్రోమోలో వినిపించిన మాటలే. పూర్తిగా ఈ ప్రశ్నకు బండ్ల ఏం సమాధానం ఇచ్చాడన్నది ఆ ఇంటర్వ్యూ పూర్తిగా చూశాకే తెలుస్తుంది.