Begin typing your search above and press return to search.

వ‌ర్మ‌పై కోర్టు సీరియ‌స్...`ఆఫీస‌ర్` పై స్టే!

By:  Tupaki Desk   |   17 May 2018 5:44 AM GMT
వ‌ర్మ‌పై కోర్టు సీరియ‌స్...`ఆఫీస‌ర్` పై స్టే!
X
నిత్యం త‌న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిల‌వ‌డం విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు వ‌ర్మ‌కు అల‌వాటు. కొద్ది రోజుల క్రితం ప‌వ‌న్ ను దూషించ‌మ‌ని శ్రీ‌రెడ్డిని ఉసిగొల‌ప‌డం మొద‌లు.....నేల టిక్కెట్టు ఆడియో వేడుక లో పాల్గొన్న ప‌వ‌న్ పై తీవ్ర‌స్థాయిలో అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం వ‌ర‌కు వ‌ర్మ‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. తాజాగా, అక్కినేని నాగార్జున‌కు వ‌ర్మ వ‌ల్ల కొత్త చిక్కులు వ‌చ్చిప‌డ్డాయి. నాగ్ - వ‌ర్మ ల కాంబోలో తెర‌కెక్కిన `ఆఫీస‌ర్ `సినిమా విడుద‌ల జాప్యానికి వ‌ర్మ కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. వైటీ ఎంట‌ర్ టైన్స్ మెంట్స్ తో వ‌ర్మ‌కు ఉన్న లావాదేవీల వివాదం కేసులో వ‌ర్మ కోర్టుకు హాజ‌రు కాక‌పోవ‌డంతోనే `ఆఫీస‌ర్ `సినిమా విడుద‌ల‌పై బాంబే హైకోర్టు స్టే విధించిన‌ట్లు తెలుస్తోంది. కోర్టు ఆదేశాల‌ను బేఖాత‌రు చేసిన వ‌ర్మ‌పై కోర్టు సీరియ‌స్ అయిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో జూన్ 1న `ఆఫీస‌ర్` విడుద‌ల‌పై సందిగ్ధం ఏర్ప‌డింది.

టెక్నికల్ కార‌ణాల వల్ల `ఆఫీసర్` చిత్ర రిలీజ్ ను మే 25 నుంచి జూన్ 1 తేదీకి వాయిదా వేశానని వర్మ ట్వీట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఆ వాయిదా వెనుక అస‌లు కార‌ణం వేరే ఉన్న‌ట్లు తెలుస్తోంది. తమకు వర్మ రూ.1.06 కోట్లు చెల్లించాలని వైటీ ఎంటర్‌ టైన్‌ మెంట్ లిమిటెడ్ తర‌ఫున బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై మే 4న కోర్టులో జ‌రిగిన విచార‌ణ‌కు వర్మ తర‌ఫు న్యాయవాది హాజరయ్యారు. తన క్లయింట్ వర్మ మే 7న జరిగే విచారణకు హాజరవుతారని న్యాయమూర్తికి ఆయ‌న‌ వెల్లడించారు. అయితే, మే 7న‌ జరిగిన విచారణకు కూడా వర్మ గైర్హాజ‌ర‌య్యారు. వ‌ర్మ‌కు బదులుగా `ఆఫీస‌ర్` సహ నిర్మాత సుధీర్ చంద్ర పదిరి కోర్టుకు హాజర‌య్యారు. వైటీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ కు రూ.1.06 కోట్లు చెల్లించేందుకు వ‌ర్మ సిద్ధ‌మ‌య్యార‌ని సుధీర్ కోర్టుకు తెలిపారు. అయితే, వ‌ర్మ కోర్టుకు హాజ‌రుకాక‌పోవడంపై న్యాయ‌మూర్తి సీరియస్ అయ్యారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు వ‌ర్మ విచారణకు హాజ‌రై డ‌బ్బు చెల్లించే ఒప్పంద పత్రంపై సంతకం చేయాలని సూచించింది. అయితే, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ వర్మ ఆ రోజు కోర్టుకు హాజరుకాలేదు. దీంతో, `ఆఫీస‌ర్`చిత్రం విడుద‌లపై కోర్టు స్టే విధించింది.ఆ చిత్ర హక్కులు, డిజిట‌ల్ రైట్స్, తదితర విషయాల్లో వర్మ ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది.