Begin typing your search above and press return to search.

'అరవింద సమేత'పై సీమ విద్యార్థుల ఆగ్రహం

By:  Tupaki Desk   |   15 Oct 2018 2:07 PM GMT
అరవింద సమేతపై సీమ విద్యార్థుల ఆగ్రహం
X
టాలీవుడ్ లేటెస్ట్ బడా మూవీ ‘అరవింద సమేత’ చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆ ప్రాంత సాహితీ వేత్తలు ఇప్పటికే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా సీమ వాసుల ఆగ్రహం రోజు రోజుకూ పెరుగుతోంది. గతంలో ఫ్యాక్షనిజం నేపథ్యంలో వచ్చిన సినిమాలు తమ ప్రాంతాన్ని చాలా చెడుగా చూపించి సొమ్ము చేసుకున్నాయని.. ఆ తర్వాత ఆ తరహా సినిమాలు ఆగిపోయాయని.. ఇప్పుడు మళ్లీ త్రివిక్రమ్ శ్రీనివాస్ సీమను ఈ సినిమాలో చెడుగా చూపించారని ఆరోపిస్తున్నారు. ఐతే కేవలం సామాజిక మాధ్యమాల్లో విమర్శలు గుప్పించడానికి పరిమితం కాకుండా ఆ ప్రాంత వాసులు కార్య క్షేత్రంలోకి దిగారు. ఈ సినిమాలో చూపిన కొన్ని సీన్లు అభ్యంతరకరంగా ఉన్నాయని, వెంటనే వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ విద్యార్థి పోరాట సమితి ఆధ్వర్యంలోని హైదరాబాద్‌లోని ప్రెస్ క్లబ్‌లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ.. రాయలసీమ ప్రాంతంపై తెలుగు సినీ పరిశ్రమ కక్ష గట్టిందని.. అందుకే తమ ప్రాంతాన్ని టార్గెట్ చేస్తూ సినిమాలు తీస్తున్నారని.. వినోదం పేరుతో మా ప్రాంతాన్ని, ఇక్కడి ప్రజలను చాలా దారుణంగా సినిమాల్లో ఫోకస్ చేస్తున్నారని ఆరోపించారు. సీమలో కనుమరుగైన ఫ్యాక్షనిజాన్ని దర్శకుడు త్రివిక్రమ్ ‘అరవింద సమేత' సినిమా ద్వారా మళ్లీ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్నారు. ఈ సినిమా వల్ల సీమలో మళ్లీ ఫ్యాక్షన్ గొడవలు మొదలయ్యే ప్రమాదం లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు.. మాటలు అభ్యంతరకంగా ఉన్నాయని.. యువతపై చెడు ప్రభావం చూపించేలా ఉన్నాయని... వాటిని వెంటనే సినిమా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే సినిమాను ఆడనివ్వమన్నారు. ముందు ఇలాంటి సినిమా తీసినందుకు దర్శకుడు త్రివిక్రమ్ వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు,