Begin typing your search above and press return to search.

మాస్ రాజా.. ముచ్చట్లకైతే కొదవ లేదు

By:  Tupaki Desk   |   23 July 2016 1:30 PM GMT
మాస్ రాజా.. ముచ్చట్లకైతే కొదవ లేదు
X
ఒకప్పుడు రవితేజ ఏడాదికి కనీసం రెండు రిలీజులైనా ఉండేలా చూసుకున్నాడు. ఎప్పుడూ మూడు నాలుగు ప్రాజెక్టులు లైన్లో పెట్టేవాడు. కానీ ఓ టైంలో వరుసగా అరడజను దాకా ఫ్లాపులు రావడంతో మాస్ రాజా కొంచెం స్పీడు తగ్గించినా.. మళ్లీ సక్సెస్ బాట పట్టాక జోరందుకున్నాడు. ఒక సినిమా పూర్తయి విడుదలకు సిద్ధమవుతుంటే.. ఇంకో సినిమా పట్టాలెక్కేసేది. కానీ గత ఏడాది ‘బెంగాల్ టైగర్’ తర్వాత మాత్రం అనుకోకుండా గ్యాప్ వచ్చేసింది. ఆ సినిమా విడుదలై ఎనిమిది నెలలు దాటిపోయినా.. మాస్ రాజా కొత్త సినిమా పట్టాలెక్కలేదు. ఐతే ఈ ఎనిమిది నెలల్లో రవితేజ చుట్టూ చాలా ప్రాజెక్టులు తిరిగాయి. కానీ అందులో ఏది కూడా కార్యరూపం దాల్చలేదు.

వేణు శ్రీరామ్-దిల్ రాజుల సినిమా అటకెక్కేసింది. సుధీర్ వర్మ సినిమా గురించి చర్చే లేదు. చక్రి అనే కొత్త దర్శకుడి సినిమా ఆల్మోస్ట్ పట్టాలెక్కినట్లే కనిపించింది కానీ.. ఇప్పుడు దాని మీదా సందేహాలు నెలకొన్నాయి. ఇప్పుడేదో విక్రమ్ సిరి అనే యువ దర్శకుడి పేరు వినిపిస్తోంది. అది కాకుండా ‘పవర్’ సినిమాతో తనకు పవర్ ఫుల్ సినిమా ఇచ్చిన బాబి దర్శకత్వంలో సినిమా అని.. ఇంకెవరో కొత్త దర్శకుడితో ఇంకో సినిమా అని ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ చాలవన్నట్లు ఇప్పుడు ఇంకో కొత్త కహానీ తెరమీదికి వచ్చింది. కిక్.. కిక్-2 చిత్రాల రచయిత వక్కంతం వంశీ.. రవితేజకు ఓ కథ చెప్పాడట.. అది అతడికి బాగా నచ్చిందట. ఓవైపు వంశీ తన దర్శకత్వ కలను నెరవేర్చుకునే పనిలో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ సినిమాకు స్క్రీప్టు తీర్చిదిద్దుకుంటున్నాడు. ఇంతలో మాస్ రాజాకు కథ ఎక్కడ వినిస్తాడన్నది డౌటు. జస్ట్ కథ ఇస్తున్నాడా లేక దర్శకుడిగా తన రెండో సినిమాకు ఇప్పట్నుంచే సన్నాహాలు చేసుకుంటున్నాడా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా రవితేజ హీరోగా అంటూ చాలా సినిమాల గురించి ముచ్చట్లు వినిపిస్తున్నాయి కానీ.. ఇంతకీ అతనెప్పుడు కొత్త సినిమాకు శ్రీకారం చుడతాడన్నదే తెలియట్లేదు.