Begin typing your search above and press return to search.

మాస్ రాజా మళ్లీ రిస్క్ చేయడానికే రెడీ

By:  Tupaki Desk   |   12 Sep 2017 3:30 PM GMT
మాస్ రాజా మళ్లీ రిస్క్ చేయడానికే రెడీ
X
దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ‘రాజా ది గ్రేట్’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు మాస్ రాజా రవితేజ. ఈ సినిమాతో పాటే ‘టచ్ చేసి చూడు’ అనే మరో సినిమా కూడా మొదలుపెట్టాడు కానీ.. దానికి మధ్యలో బ్రేక్ పడింది. ‘రాజా ది గ్రేట్’ పని ముగించాక దీని సంగతేమో చూస్తాడనుకుంటే.. వేరే సినిమాకు కమిట్మెంట్ ఇచ్చేశాతను. తమిళ సినిమా ‘బోగన్’ రీమేక్ లో రవితేజ నటించబోతున్నాడు. తమిళ వెర్షన్ కు దర్శకత్వం వహించిన లక్ష్మణే తెలుగులోనూ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ చిత్రానికి కాస్టింగ్ సంగతి కూడా దాదాపుగా ఖరారైనట్లే తెలుస్తోంది.

రవితేజ సరసన కేథరిన్ థ్రెసా లీడ్ హీరోయిన్ రోల్ చేయనుందట ఈ సినిమాలో. తమిళంలో ఈ పాత్రను హన్సిక చేసింది. ఒరిజినల్లో నటించిన అక్షర గౌడ తెలుగులోనూ తన పాత్రనే చేయబోతోంది. ఇంకో లేడీ క్యారెక్టర్లో ‘అప్పట్లో ఒకడుండేవాడు’ భామ తన్యా హోప్ నటిస్తుందట. తమిళంలో జయం రవి చేసిన పాత్రను రవితేజ చేయబోతుండగా.. అరవింద్ స్వామి క్యారెక్టర్ని ఎస్.జె.సూర్యతో చేయించాలని చూస్తున్నట్లు సమాచారం. ‘బోగన్’ ఒక పోలీస్-క్రిమినల్ మధ్య నడిచే సూపర్ నేచురల్ థ్రిల్లర్. ‘తనీ ఒరువన్’ తర్వాత జయం రవి-అరవింద్ స్వామి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది. యావరేజ్ గా ఆడింది. అలాంటి సినిమా రీమేక్ కు మాస్ రాజా ఒప్పుకోవడం విశేషమే. ఇంతకుముందు రవితేజ నటించిన రీమేక్ సినిమాలు ‘వీడే’.. ‘నా ఆటోగ్రాఫ్’.. ‘శంభో శివ శంభో’ అతడికి చేదు అనుభవాలు మిగిల్చాయి. అయినప్పటికీ మళ్లీ రీమేక్ మూవీతో రిస్క్ చేయడానికి రెడీ అయిపోయాడు మాస్ రాజా. మరి ఈసారి రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం.