Begin typing your search above and press return to search.

మాస్ రాజా.. ఇలా తయారయ్యాడేంటి?

By:  Tupaki Desk   |   5 May 2016 5:30 PM GMT
మాస్ రాజా.. ఇలా తయారయ్యాడేంటి?
X
మాస్ రాజా రవితేజ అంటే హుషారుకు మరో పేరు. తెర మీదే కాదు.. బయట కూడా చాలా ఎనర్జీతో ఉంటాడు రవితేజ. ఆ ఎనర్జీతోనే శరవేగంగా సినిమాలు చేసేస్తుంటాడు. ఇప్పుడు స్టార్ హీరోలందరూ స్పీడు పెంచడానికి ఒకరకంగా రవితేజానే కారణం. పెద్ద హీరోలందరూ ఏడాదికో రెండేళ్లకో ఓ సినిమా చేస్తుంటే రవితేజ మాత్రం ఏడాది రెండు మూడు సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్లాడు ఓ టైంలో. ఇది చూసి మిగతా హీరోల్లో కూడా మార్పు వచ్చింది. మధ్యలో వరుస ఫ్లాపుల వల్ల కొంచెం డల్ అయినా.. మళ్లీ ఊపందుకుని గత రెండేళ్లలో వేగంగా సినిమాలు పూర్తి చేశాడు మాస్ రాజా.

కానీ కొత్త ఏడాదిలో మాత్రం రవితేజ చాలా ఖాళీగా గడిపేస్తున్నాడు. ‘బెంగాల్ టైగర్’ సినిమా వచ్చి ఐదు నెలలవుతోంది. ఇప్పటిదాకా రవితేజ తర్వాతి సినిమా మొదలుకాలేదు. అలాగని అవకాశాలు లేవా అంటే అదేం లేదు. రెండు మూడు ప్రాజెక్టులు రెడీగా ఉన్నాయి. కానీ సినిమా మొదలుపెట్టడంలోనే టైం తీసుకుంటున్నాడు. దిల్ రాజు-వేణు శ్రీరామ్ ల కథను తిరస్కరించాక.. కొత్త దర్శకుడు చక్రితో ‘రాబిన్ హుడ్’ సినిమాను లైన్లో పెట్టాడు. ఆ సినిమాకు స్క్రిప్టు కూడా ఎప్పుడో రెడీ అయిపోయింది. కానీ సినిమా మాత్రం మొదలు కాలేదు.

రవితేజ మాత్రం సిక్స్ ప్యాక్ బాడీ పెంచుతూ గడిపేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌ గా నటించబోతున్న రాశిఖన్నాను ‘సుప్రీమ్’ ప్రమోషన్ల సందర్భంగా రవితేజ సినిమా గురించి అడిగితే జూన్ నెలలో సినిమా మొదలయ్యే అవకాశమున్నట్లు హింట్ ఇచ్చింది. అంటే దాదాపు ఆరేడు నెలల తర్వాత రవితేజ రంగంలోకి దిగబోతున్నాడన్నమాట.