Begin typing your search above and press return to search.

మాస్ మహారాజ్.. ఆ పేరెలా వచ్చిందంటే..

By:  Tupaki Desk   |   31 May 2016 9:30 AM GMT
మాస్ మహారాజ్.. ఆ పేరెలా వచ్చిందంటే..
X
చిరంజీవికి మెగాస్టార్.. నాగార్జునకు యువ సామ్రాట్.. బాలయ్యకు యువరత్న.. వెంకటేష్‌ కు విక్టరీ.. పవన్ కళ్యాణ్ కు పవర్ స్టార్.. మహేష్ బాబుకు ప్రిన్స్.. ఈ బిరుదులన్నీ ఎవరిచ్చారో.. ఎప్పుడిచ్చారో.. ఎలా పాపులర్ అయిపోయాయో.. మొత్తానికి వారి పేర్ల ముందు అవి అలా ఫిక్సయిపోయాయి. నాగ్.. బాలయ్య పెద్దోళ్లయిపోయారు కాబట్టి ‘యువ’ అనలేక పక్కనబెట్టేశారు కానీ.. మిగతా వాళ్లనూ మాత్ర ఆ బిరుదులతోనే పిలుస్తున్నారు అభిమానులు. ఐతే ఏ బ్యాగ్రౌండ్ లేకుండా మొదట్లో చిన్నా చితకా పాత్రలేసి.. ఆ తర్వాత నెగెటివ్ క్యారెక్టర్లు చేసి.. చివరికి హీరోగా నిలదొక్కుకుని స్టార్ గా ఎదిగిన రవితేజకు కూడా ‘మాస్ మహారాజ్’ అనే బిరుదు వచ్చి పేరు పక్కన చేరిపోయింది. ఇంతకీ ఈ బిరుదు ఎవరిచ్చారు.. ఎప్పుడిచ్చారన్నది ఎవరికీ తెలియదు.

నిన్న మంచు లక్ష్మి నిర్వహించే ‘మేము సైతం’ కార్యక్రమంలో ఈ గుట్టు విప్పాడు రవితేజ. ‘లక్ష్యం’ సినిమా ఆడియో వేడుక సందర్భంగా డైరెక్టర్ హరీష్ శంకర్ తనకిలా నామకరణం చేసేశాడని రవితేజ అన్నాడు. ‘‘ఈ మాస్ మహారాజ్ అనే మాటతో నాకు ఎలాంటి సంబంధం లేదు. హరీష్ నన్ను అప్పుడప్పుడూ సరదాగా ఇలా అనేవాడు. ఐతే ‘లక్ష్యం’ ఆడియో ఫంక్షన్లో వేదిక మీదికెక్కి యాంకర్ సుమ గారితో ‘మాస్ మహారాజ్’ అని పిలిపించి నన్ను స్టేజ్ మీదికి ఆహ్వానించాడు. ఇక అప్పట్నుంచి అందరూ అలా అనడం మొదలుపెట్టారు’’ అని రవితేజ చెప్పాడు. కుటుంబానికి అండగా నిలవాల్సిన ఓ అన్న చేతుల్లేక వికలాంగుడిగా మారిన నేపథ్యంలో అతడి చెల్లెల్లను.. వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి ‘మేముసైతం’ కార్యక్రమంలో భాగంగా ఓ షాపింగ్ మాల్ లోని బేకరీలోకి వెళ్లి అమ్మకాలు జరిపాడు మాస్ రాజా. ఆ డబ్బుల్ని ‘మేము సైతం’ కార్యక్రమంలో ఆ కుటుంబానికి అందించాడు.