Begin typing your search above and press return to search.

‘రవితేజ సిగరెట్ కూడా తాగడు’

By:  Tupaki Desk   |   17 July 2017 8:38 AM GMT
‘రవితేజ సిగరెట్ కూడా తాగడు’
X
ఇటీవల తెలుగు సినీ పరిశ్రమలో డ్రగ్స్ తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న ప్రముఖుల్లో హీరో రవితేజ ఒకడు. అతడికి పోలీసులు ఈ విషయమై నోటీసులు కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా రవతేజ వైపు నుంచి ఎలాంటి వివరణా రాలేదు. ఐతే ఈ రోజు రవితేజ తల్లి రాజ్యలక్ష్మితో పాటు వాళ్ల ఫ్యామిలీ డాక్టర్ కడియాల రాజేంద్ర కూడా ఈ రోజు మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చారు. రవితేజకు డ్రగ్స్ అలవాటుందన్నది శుద్ధ అబద్ధమని వాళ్లిద్దరూ తేల్చి చెప్పారు.

‘‘రవితేజ గురించి దుష్ప్రచారాలు జరుగుతున్నాయి. అతడి గురించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. భరత్ ఇంతకుముందు డ్రగ్స్ కేసుల్లో దొరికిన మాట వాస్తవం. ఐతే ఆ సమయంలో పదే పదే రవితేజ బ్రదర్.. రవితేజ బ్రదర్... అంటూ ప్రచారం చేశారు. భరత్ తప్పు చేశాడు. కానీ దాన్ని సరిదిద్దుకునేలోపు అతను ప్రాణాలతోనే లేకుండా పోయాడు. భరత్ ఎప్పుడూ అబద్ధం చెప్పేవాడు కాదు. తాగితే తాగాననే చెప్పేవాడు.

చివరగా నన్ను కలిసినపుడు తాను ‘బిగ్ బాస్’కు సెలక్టయ్యానని.. మందు మానేశానని అన్నాడు. ఒక సిస్టమ్ ఫాలో అవుతున్నట్లు చెప్పాడు. వెజిటేరియన్ గా మారానన్నాడు. తన జీవితం మారుతోందని చెప్పాడు. ఈ రోజు అతడి ఇంటికెళ్లి చూస్తే ఎవరికైనా దు:ఖం వస్తుంది. ‘బిగ్ బాస్’ను కలవడానికి 24 రోజులే ఉందని.. దాని కోసం ఎలా తయారవ్వాలి.. సిస్టం ఎలా ఉండాలి.. ఎన్నిగంటలకు రావాలి.. ఎప్పుడు యోగా చేయాలి.. ఇవన్నీ కూడా రాసుకున్నాడు. నువ్వు ‘బిగ్ బాస్’కు వెళ్తే అక్కడ మందు దొరకట్లేదని మళ్లీ గొడవ చేస్తావేమో అంటూ భరత్ మీద మేం జోకులు కూడా వేశాం. అతడికి యాక్సిడెంట్ అయినపుడు కూడా మద్యం తాగలేదు. అలా రోడ్డు మీద వెహికల్ పార్క్ చేస్తే ఎవరైనా వెళ్లి ఢీకొడతారు. భరత్ తాగినపుడు బాగానే ఉన్నాడు. కానీ మానేశాక ప్రాణాలు కోల్పోయాడు.

రవితేజ విషయానికొస్తే అతడికి సిగరెట్ వాసన కూడా పడదు. ఎవరరైనా ఇంటికొచ్చినా ఆ వాసన రాకుండా చూసుకోవాలని అంటాడు. అతన ఎవరితోనూ కలవడు. రవితేజ డ్రగ్స్ లోకి రావడం అన్నది జరగదు. అతడికి ఆ అలవాటు ఎప్పుడూ లేదు. తన గురించి వస్తున్న వార్తలు చూసి కుటుంబ సభ్యులందరూ బాధపడుతున్నారు. ఇంతకుముందు తమ్ముడి అంత్యక్రియలకు రాకపోవడంపై వివాదం తలెత్తింది. ఇప్పుడూ అలాగే చేస్తున్నారు. తన నిర్మాతకు నష్టం రాకూడదని అతను షూటింగులో పాల్గొంటున్నాడు. త్వరలోనే దాన్నుంచి బయటికి వస్తాడు. రవితేజ తప్పు చేయలేదని మీడియా వాళ్లే రెండు మూడు రోజుల్లో అంటారు’’ అని రవితేజ ఫ్యామిలీ డాక్టర్ కడియాల రాజేంద్ర తెలిపాడు.

రవితేజ తల్లి రాజ్యలక్ష్మి కూడా ఇదే తరహాలో మాట్లాడింది. తన కొడుక్కి సిగరెట్ అలవాటు కూడా లేదంది. కావాలనే అతణ్ని డ్రగ్స్ కేసులో ఇరికించారంది. మద్యం మత్తులోనే తన చిన్న కొడుకు భరత్ యాక్సిడెంట్ చేశాడన్న ప్రచారంలోనూ వాస్తవం లేదని ఆమె చెప్పింది. భరత్ అన్ని దురలవాట్లూ మానేశాడని తెలిపింది. రవితేజను భరత్ తో ముడిపెట్టి చూడొద్దని కోరింది.