Begin typing your search above and press return to search.

గీత మేడమ్ జోరు మామూలుగా లేదుగా

By:  Tupaki Desk   |   24 May 2019 6:54 AM GMT
గీత మేడమ్ జోరు మామూలుగా లేదుగా
X
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న కెరీర్ ఇప్పుడు పీక్స్ లో ఉంది. అవకాశాల పరంగా చూసుకుంటే రష్మికు ఎండాకాలం ఆఫర్ల వాన కురుస్తోంది. ఇప్పటికే చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్న రష్మికకు తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ కొత్త సినిమా #విజయ్64 లో హీరోయిన్ అవకాశం వచ్చిందని సమాచారం. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా తీసుకునేందుకు ప్రస్తుతం రష్మికతో చర్చలు సాగుతున్నాయట.

తమిళంలో ఇప్పటికే కార్తి తాజా సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది రష్మిక. ఈ సినిమాతోనే రష్మిక కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇంకా కోలీవుడ్ లో మొదటి సినిమా రిలీజ్ కాకముందే విజయ్ లాంటి స్టార్ హీరో సినిమా అవకాశం సాధించం గమనార్హం. ఇదిలా ఉంటే తెలుగులో అసలు రష్మిక జోరు టాప్ గేర్ లో ఉంది. విజయ్ దేవరకొండ సినిమా 'డియర్ కామ్రేడ్' లో రష్మికనే హీరోయిన్. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'భీష్మ' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కాకుండా మహేష్ బాబు - అనిల్ రావిపూడి సినిమాలో కూడా రష్మిక హీరోయిన్ గా ఎంపికయింది. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో పట్టాలెక్కనున్న చిత్రంలో కూడా రష్మికను హీరోయిన్ గా తీసుకున్నారట.

ఇక కన్నడలో కూడా రష్మికకు క్రేజీ ఆఫర్లు ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ చేతిలో ఉన్న ఆఫర్లు కాకుండా ఇంకా చాలా ఆఫర్లు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయని సమాచారం. ఒక భాషలో బిజీగా ఉండడం సరే కానీ ఇలా తెలుగు.. తమిళం.. కన్నడ ఇలా మూడు భాషల్లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగడం అరుదైన విషయమే. ఇప్పుడు చేతిలో ఉన్న ప్రాజెక్టులలో ఒకటి అరా హిట్స్ తగిలితే ఇప్పట్లో రష్మిక జోరును ఆపడం ఇక ఎవ్వరివల్లా కాదేమో.