Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: రారండోయ్ వేడుక చూద్దాం

By:  Tupaki Desk   |   26 May 2017 6:06 PM GMT
మూవీ రివ్యూ: రారండోయ్ వేడుక చూద్దాం
X
చిత్రం : ‘రారండోయ్ వేడుక చూద్దాం’

నటీనటులు: అక్కినేని నాగచైతన్య - రకుల్ ప్రీత్ - జగపతిబాబు - సంపత్ - కౌసల్య - వెన్నెల కిషోర్ - చలపతిరావు - బెనర్జీ - అన్నపూర్ణ - పోసాని కృష్ణమురళి - పృథ్వీ - సప్తగిరి - తాగుబోతు రమేష్ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: విశ్వేశ్వర్
స్క్రీన్ ప్లే: సత్యానంద్
నిర్మాత: నాగార్జున అక్కినేని
కథ - మాటలు - దర్శకత్వం: కళ్యాణ్ కృష్ణ కురసాల

అక్కినేని నాగార్జున కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల. దర్శకుడిగా అతను చేసిన తొలి సినిమా ‘సోగ్గాడే చిన్నినాయనా’ సెన్సేషనల్ హిట్టయింది. తన రెండో సినిమాను కూడా నాగ్ బేనర్లోనే.. ఆయన తనయుడు నాగచైతన్య హీరోగా రూపొందించాడు కళ్యాణ్. అదే.. రారండోయ్ వేడుక చూద్దాం. ప్రోమోలతో ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా ఈ రోజే మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

శివ (నాగచైతన్య) ఒక బిలియనీర్ కొడుకు. అతను తన అన్నయ్య పెళ్లి కోసమని ఓ పల్లెటూరికి వెళ్లి.. అక్కడ భ్రమరాంభ (రకుల్ ప్రీత్)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఆ వేడుక జరిగినన్ని రోజులూ తన వెంటే తిరుగుతాడు. తిరిగి సిటీకి వచ్చే సమయానికి.. భ్రమరాంభ కూడా తన చదువు కోసం సిటీకే వస్తుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం పెరుగుతుంది. ఐతే తండ్రి కోరిక ప్రకారం ఆయన చూపించిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో ఉన్న భ్రమరాంభ.. శివను ఓ స్నేహితుడిలాగే చూస్తుంది. మరోవైపు శివ.. భ్రమరాంభ కుటుంబాల మధ్య విభేదాలున్న సంగతి కూడా తర్వాత బయటపడుతుంది. మరి ఈ పరిస్థితుల్లో శివ.. భ్రమరాంభ మనసు ఎలా గెలిచాడు.. ఇరు కుటుంబాల్ని ఒప్పించి ఆమెను తన సొంతం ఎలా చేసుకున్నాడు అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

హీరోయిన్ పరిణతి లేని అమ్మాయి. అన్నీ తనకు నచ్చినట్లే జరగాలనుకుంటుంది. తనే కరెక్ట్ అనుకుంటుంది. ఎప్పుడూ తన యాంగిల్లోనే ఆలోచిస్తుంది. అవతలి వాళ్ల ఫీలింగ్స్ పట్టవు. అలాంటి అమ్మాయిని ప్రేమించిన హీరో తన కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడూ తన గురించే ఆలోచిస్తూ.. తనకు ఇబ్బంది లేకుండా చూసుకుంటూ.. తన కోసమే బతుకుతుంటాడు. అయినా హీరోయిన్ అతడి మనసు అర్థం చేసుకోకుండా హర్ట్ చేస్తుంది. ఆ సందర్భంలో అబ్బాయి ఫీలింగ్స్ ఎలా ఉంటాయి.. అతను ఎలా రియాక్టవుతాడో చూపించే సీన్ ఒకటి ‘రారండోయ్..’లో ఉంది. థియేటర్లో ఉన్న ఏ ప్రేక్షకుడైనా ఈ సన్నివేశానికి కనెక్టవ్వాల్సిందే. ఈ సీన్ నేపథ్యం.. దాన్ని తీర్చిదిద్దిన తీరు.. అందులోని డైలాగ్స్.. చైతూ నటన.. అన్నీ కూడా పర్ఫెక్ట్ అనిపిస్తాయి. ఎంత బాగా రాశారు.. ఎంత బాగా తీశారు.. ఎంత బాగా చేశారు అనిపిస్తుంది ఈ సీన్ చూస్తే.

ఈ సీన్ స్థాయిలోనే సినిమా అంతా ఉండి ఉంటే.. ‘రారండోయ్..’ నిజంగానే ఒక వేడుక అయ్యేది. నాగ్ అన్నట్లు సినిమా స్థాయే వేరుగా ఉండేది. కానీ సినిమా అంతటా ఈ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయలేకపోయాడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. నిర్మాతగా నాగార్జునకు ఉన్న క్రెడిబిలిటీ.. పైగా ‘రారండోయ్..’ గురించి ఆయన చెప్పిన మాటలు విని.. దీనిపై మరీ ఎక్కువ అంచనాలు పెట్టుకుంటే కష్టం. ఐతే మామూలుగా చూస్తే ఓకే అనిపిస్తుంది ‘రారండోయ్’. పైన చెప్పుకున్న సన్నివేశం తరహాలోనే కొన్ని మెరుపులున్నప్పటికీ.. రొటీన్ కథాకథనాలు ఈ సినిమాకు మైనస్ అయ్యాయి.

‘రారండోయ్..’లో కథ రొటీన్. ఎప్పట్నుంచో చూస్తున్నదే. కథనం కూడా మామూలుగానే సాగిపోతుంది. ఐతే ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేసే కొన్ని మూమెంట్స్ వల్ల ‘రారండోయ్..’ అలా అలా సాగిపోతుంది. సినిమా ఆరంభంలో పెళ్లి వేడుక నేపథ్యంలో పెట్టిన సెటప్ అదీ చూస్తే.. నిజంగా ఒక వేడుక లాంటి సినిమా చూడబోతున్నాం అనిపిస్తుంది. కానీ బోలెడంతమంది జనాలు.. కలర్ ఫుల్ అట్మాస్ఫియర్.. ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న లీడింగ్ కమెడియన్లు.. ఈ సెటప్ అంతా చూసి ఒక పాజిటివ్ వైబ్రేషన్ కలుగుతుంది. కానీ ఈ ఎపిసోడ్ ను ఏదో అలా అలా నడిపించేశాడు కానీ.. కమెడియన్లను పూర్తి స్థాయిలో వాడుకుని మంచి వినోదం పండించే అవకాశాన్ని దర్శకుడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ పెళ్లి వేడుక తర్వాత వచ్చే ప్రేమకథ సోసోగా అనిపిస్తుంది. టిపికల్ గా సాగే హీరోయిన్ పాత్ర ఎంటర్టైన్ చేసినా.. ప్రేమ సన్నివేశాల్లో కొత్తదనం లేకపోవడం నిరాశ పరుస్తుంది.

ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం మెరుగ్గా అనిపిస్తుంది. ‘రారండోయ్..’కు బలమే ద్వితీయార్ధం. సినిమాకు హైలైట్ అనదగ్గ బ్రేకప్ సీన్ తో ‘రారండోయ్..’ ఒక్కసారిగా అలా పైకి లేస్తుంది. మధ్య మధ్యలో వెన్నెల కిషోర్ తనదైన శైలిలో ఎంటర్టైన్ చేయడంతో ద్వితీయార్ధం ప్రేక్షకుల్ని బాగానే ఎంగేజ్ చేస్తుంది. ఐతే బలమైన క్లైమాక్స్ ఉండుంటే ‘రారండోయ్..’ అంతిమంగా ప్రేక్షకులకు మంచి ఫీలింగ్ ఇచ్చేదే. ఐతే ‘నిన్నే పెళ్లాడతా’ తరహాలో కథ రాసుకున్న దర్శకుడు.. చివర్లో ఫ్యామిలీ ఎమోషన్లను సరిగా పండించలేకపోయాడు. రొటీన్ క్లైమాక్స్ తో నిరాశ పరిచాడు. అక్కడక్కడా కొన్ని మెరుపులున్నప్పటికీ.. కన్సిస్టెన్సీ లేకపోవడంతో ‘రారండోయ్..’లో ఉన్న ప్రతికూలత. ఇంకా మెరుగ్గా తీర్చిదిద్దే అవకాశమున్నా సద్వినియోగం చేసుకోలేదన్న ఫీలింగ్ కలిగిస్తుందీ సినిమా. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కడం వల్ల ఆ వర్గం ప్రేక్షకులకు ‘రారండోయ్..’ బాగానే కనెక్టయ్యే అవకాశముంది.

నటీనటులు:

నాగచైతన్య కొన్ని సన్నివేశాల్లో మెచ్యూర్డ్ గా నటించాడు. ముఖ్యంగా హీరోయిన్ తో బ్రేకప్ సీన్లో చైతూ చాలా బాగా చేశాడు. ఒరిజినల్ ఎమోషన్ చూపించాడు చైతూ ఆ సీన్లో. ఐతే అల్లరి సన్నివేశాలకు అతను సూటవ్వలేదు. జగపతిబాబు కాంబినేషన్లో వచ్చే సన్నివేశాల్లో చైతూ మెప్పించాడు. ప్రేమికుడి సంఘర్షణను బాగానే చూపించాడు. రకుల్ ప్రీత్ కు ఈ పాత్ర చాలా ప్రత్యేకమైంది. ఆమె బాగా నటించింది కూడా. చాలా సన్నివేశాల్లో ఆమె చైతూను డామినేట్ చేసింది. ఆమె పాత్రకు సినిమాలో చాలా ప్రాధాన్యం ఉంది కానీ.. దాన్ని ఇంకాస్త మెరుగ్గా తీర్చిదిద్దాల్సింది. జగపతిబాబు పాత్ర నిరాశ పరుస్తుంది. ఈ తరహా రిచ్ డాడ్ క్యారెక్టర్లు ఆయనకు రొటీన్ అయిపోతున్నాయి. ఆయన పాత్రలో ఏ ప్రత్యేకతా లేదు. హీరోయిన్ తండ్రి పాత్రలో సంపత్ బాగా చేశాడు. అతడి పాత్ర బాగుంది. విలన్ క్యారెక్టర్ మాత్రం తేలిపోయింది. చాన్నాళ్ల తర్వాత తెలుగు తెరపై కనిపించిన కౌసల్య బాగానే చేసింది. వెన్నెల కిషోర్ నవ్వించాడు. మిగతా వాళ్లంతా మామూలే.

సాంకేతిక వర్గం:

దేవిశ్రీ ప్రసాద్ తన వంతుగా ‘రారండోయ్..’కు బాగా సపోర్ట్ చేశాడు. అతడి పాటలన్నీ బాగున్నాయి. పాటల ప్లేస్మెంట్ కొంత ఇబ్బంది పెట్టినా.. అవి ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేస్తాయి. నేపథ్య సంగీతం కూడా ఓకే. విశ్వేశ్వర్ ఛాయాగ్రహణం బాగుంది. సినిమాకు ఎంచుకున్న నేపథ్యం వల్ల ఛాయాగ్రహణం కూడా కలర్ ఫుల్ గా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు అన్నపూర్ణ స్టూడియోస్ ప్రమాణాలకు తగ్గట్లే బాగున్నాయి. ఇక సీనియర్ రైటర్ సత్యానంద్ సహకారంతో కళ్యాణ్ కృష్ణ రాసుకున్న స్క్రిప్టు మామూలుగా అనిపిస్తుంది. ‘సోగ్గాడే..’లో బంగార్రాజు పాత్రను బేస్ చేసుకుని ఎంటర్టైన్ చేసినట్లే.. ఇందులో భ్రమరాంభ పాత్రను ఆధారంగా పెట్టుకున్నాడతను. ఐతే ఆ పాత్రను మరింత బాగా తీర్చిదిద్దుకోవాల్సింది. కొన్ని ఎమోషనల్ సీన్లలో.. కొన్ని కామెడీ సన్నివేశాల్లో కళ్యాణ్ పనితనం కనిపిస్తుంది కానీ.. తొలి సినిమా స్థాయిలో మెప్పించలేకపోయాడతను. ‘సోగ్గాడే..’లో కూడా కథాకథనాలు పాత తరహాలోనే సాగినా వాటిని మరిపించే హై డోస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన కళ్యాణ్.. ఇక్కడ ఆ స్థాయిలో ఎంటర్టైన్ చేయలేకపోయాడు. జస్ట్ ఓకే అనిపించాడు.

చివరగా: అంత వేడుకగా లేదు కానీ.. పర్వాలేదు

రేటింగ్- 2.75/5

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/


Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre