Begin typing your search above and press return to search.

హిందీ ‘టెంపర్’లో ఎవరు ఎవరితో?

By:  Tupaki Desk   |   12 Aug 2017 8:01 AM GMT
హిందీ ‘టెంపర్’లో ఎవరు ఎవరితో?
X
జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా ‘టెంపర్’. అప్పటిదాకా రొటీన్ సినిమాలతో వరుస ఫ్లాపులు ఎదుర్కొంటూ స్టార్ల రేసులో బాగా వెనుకబడిపోయి ఉన్న ఎన్టీఆర్ ఈ సినిమాతో మళ్లీ తనేంటో రుజువు చేసుకున్నాడు. పెర్ఫామెన్స్ పరంగా ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలవడమే కాదు.. అతడికి చాలా కాలం తర్వాత మంచి కమర్షియల్ సక్సెస్ కూడా అందించింది ‘టెంపర్’. పొరుగు భాషల్లోకి కూడా వెళ్లగల బలమైన.. యూనివర్శల్ కంటెంట్ ఉండటంతో ఈ చిత్రంపై బాలీవుడ్.. కోలీవుడ్ వాళ్లు కన్నేశారు. తమిళంలో విశాల్ హీరోగా ఈ సినిమాకు సన్నాహాలు జరుగుతుండగా.. హిందీలో ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతోంది కూడా.

అందరూ అనుకున్నట్లుగానే రణ్వీర్ సింగ్ హిందీలో దయా పాత్ర పోషించబోతున్నాడు. మాస్ మసాలా సినిమాలు తీయడంలో దిట్ట అయిన రోహిత్ శెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో రాబోయే తొలి సినిమా ఇదే. చిన్న స్థాయి హీరోగా కెరీర్ ఆరంభించిన రణ్వీర్.. గత కొన్నేళ్లతో పెద్ద స్థాయికి చేరుకున్నాడు. చివరగా అతను నటించిన ‘బాజీరావు మస్తానీ’ పెద్ద హిట్టయింది. అతడి స్టేచర్ ను పెంచింది. ఇక రోహిత్ శెట్టి అనగానే ‘గోల్ మాల్’ లాంటి మాస్ మసాలా సినిమాలు గుర్తుకొస్తాయి. వీళ్లిద్దరికీ ‘టెంపర్’ సరైన సినిమానే అవుతుందని అంచనా వేస్తున్నారు. మరి పూరి-ఎన్టీఆర్ ల మ్యాజిక్ ను ఈ జోడీ రిపీట్ చేస్తుందేమో చూడాలి. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది.