శృంగార పురుష మాల్యా లీలలు

Thu Oct 18 2018 11:28:07 GMT+0530 (IST)

బ్యాంకులకు వేల కోట్ల మేర టోకరా వేసి విదేశాలకు పారిపోయిన మాల్యా పై సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. మాల్యా పాత్రను ప్రతిబింబిస్తూ బాలీవుడ్ స్టార్ హీరో గోవిందా నటించిన `రంగీలా రాజా` త్వరలో రిలీజ్‌కి వస్తోంది. ఇదివరకూ రిలీజైన పోస్టర్లు టీజర్లకు అద్భుత స్పందన వచ్చింది. తాజాగా దసరా కానుకగా `రంగీలా రాజా` ట్రైలర్ రిలీజైంది. ట్రైలర్ మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి.విలాస పురుషుడు రసిక రాజాగా.. కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా ఆహార్యాన్ని అచ్చు గుద్దేశాడు గోవిందా. ఇండస్ట్రీ బెస్ట్ మోడల్స్ తో మాల్యా నెరిపిన రిలేషన్ షిప్స్‌ని ఈ ట్రైలర్‌లో అద్భుతంగా ఆవిష్కరించారు. గోవిందా మార్క్ ఫన్ రొమాన్స్ ఆకట్టుకుంది. ఇకపోతే ఇందులో గోవిందా ద్విపాత్రాభినయం సంథింగ్ స్పెషల్. ఓవైపు మాల్యా పాత్రలో మెరుపులు మెరిపిస్తూనే మరోవైపు స్వామీజీ గెటప్‌లోనూ అదరగొట్టాడు.

ఆసక్తికరంగా ఈ సినిమాలో 90ల నాటి గోవిందాని చూస్తారని ఇదివరకూ ఈ చిత్ర నిర్మాత ప్రహ్లాద్ నిహలానియా తెలిపారు. అందుకు తగ్గట్టే ట్రైలర్ ఆద్యంతం నాటి మెరుపుల్ని ఆవిష్కరించాడు గోవిందా. పాతికేళ్ల నాటి అదే యవ్వనసిరులతో కనిపించాడు ఈ సీనియర్ హీరో. పాతికేళ్ల నాటి `రంగీలా రాజా` అప్పియరెన్స్ తాజా సినిమాలోనూ చూపించాడు. ఆంఖేన్ ఇలజామ్ షోలా ఔర్ షబ్నామ్ వంటి చిత్రాల్లో గోవిందా ఎలా ఉండేవాడో ఇప్పుడు అలానే కనిపించడం ఇక్కడ హైలైట్. నాటిరోజుల్లో గోవిందా డ్యాన్సులకు వీరాభిమానులుండే వారు. ఇప్పుడు ట్రైలర్‌లో అతడి డ్యాన్సులు నాటి రోజుల్ని తలపించాయంటే అతిశయోక్తి కాదు. ట్రైలర్ అద్భుతం. వర్కవుటైతే గోవిందా రీఎంట్రీ అదిరిపోతుందనడంలో సందేహం లేదు.