చరణ్ రికార్డు.. మహేష్ కు మూడ్రోజులు చాలు

Sun Apr 15 2018 12:05:35 GMT+0530 (IST)

రెండున్నరేళ్లుగా యుఎస్ లో తెలుగు సినిమాల వసూళ్లలో నాన్-బాహుబలి రికార్డు ‘శ్రీమంతుడు’ పేరిటే నిలిచి ఉంది. దాన్ని ‘రంగస్థలం’ ఇటీవలే అధిగమించింది. ‘శ్రీమంతుడు’ 2.89 మిలియన్ డాలర్లు వసూలు చేస్తే రెండో వీకెండ్లోనే దాన్ని దాటేసింది ‘రంగస్థలం’. ఆ తర్వాత కూడా జోరు కొనసాగిస్తూ 3.5 మిలియన్ డాలర్ల మార్కుకు చేరువగా ఉందీ చిత్రం. ఐతే ఈ రికార్డు ఇంకెంతో కాలం నిలిచి ఉండే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. రికార్డు సాధించిన రెండు వారాలకే అది బద్దలయ్యేలా కనిపిస్తోంది. భారీ అంచనాల మధ్య వచ్చే వారాంతంలో విడుదలవుతున్న మహేష్ బాబు సినిమా ‘భరత్ అనే నేను’ ఈ రికార్డును నిలవనిచ్చేలా కనిపించడం లేదు.యుఎస్ లో దాదాపు 400 లొకేషన్లలో ఏకంగా 2 వేల ప్రిమియర్ షోలు ప్లాన్ చేశారు ‘భరత్ అనే నేను’ సినిమాకు. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా చాలు ప్రిమియర్లతోనే 1.5-2 మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పాజిటివ్ టాక్ వస్తే వీకెండ్లో వసూళ్ల మోత మోగిపోతుంది. వారాంతం మొత్తంలో 10 వేల షోలు అంటున్నారంటే అవన్నీ ఫుల్స్ అయ్యాయంటే వసూళ్లు ఊహకందని విధంగా ఉంటాయి. వీకెండ్లోనే ‘రంగస్థలం’ రికార్డు ఈజీగా బద్దలైపోతుంది. ఫుల్ రన్లో 5 మిలియన్ డాలర్ల మార్కును కూడా ఈ చిత్రం అందుకునే అవకాశాలున్నాయి. తాను ఏ హీరోతో పని చేసినా ఆ హీరోకు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ఇవ్వడం అలవాటుగా మార్చుకున్న కొరటాల.. ‘భరత్ అనే నేను’తో మహేష్ మరోసారి రికార్డు విజయాన్నందిస్తాడన్న అంచనాలున్నాయి. చూద్దాం మరి ఈసారి ఏమవుతుందో?