రంగస్థలం టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్టా.. ఎట్టెట్టా?

Sun Apr 15 2018 12:04:06 GMT+0530 (IST)

సమ్మర్ సీజన్లో టాలీవుడ్ బాక్సాఫీస్ కు తిరుగులుని ఆరంభాన్నిచ్చింది ‘రంగస్థలం’ సినిమా. అంచనాల్ని మించి విజయం సాధించిన ఈ చిత్రం ఏకంగా రూ.100 కోట్ల షేర్ మార్కును దాటింది. ‘ఖైదీ నంబర్ 150’ పేరిట ఉన్న నాన్-బాహుబలి రికార్డును కూడా బద్దలు కొట్టేస్తోందీ సినిమా. తద్వారా రామ్ చరణ్.. తండ్రిని మించిన తనయుడిగా గుర్తింపు సాధించాడు. దీన్ని ఈ రకంగానే సెలబ్రేట్ చేసుకుంటే బాగుండేది కానీ.. ‘రంగస్థలం’ను తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హిట్ గా అభివర్ణిస్తుండటంతో వచ్చింది సమస్య. ఈ రోజు ‘రంగస్థలం’ టీం ప్రింట్ మీడియాలో ఒక ఫుల్ పేజీ యాడ్ ఇచ్చింది.అందులో ఈ చిత్రం రూ.175 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి తెలుగు సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిందని పేర్కొన్నారు. ఐతే ‘బాహుబలి’ ఉండగా ఇది తెలుగులో బిగ్గెస్ట్ హిట్ ఎలా అవుతుందన్న సందేహం జనాల్లో కలుగుతోంది. ఐతే కింద ఎక్కడో కనిపించీ కనిపించకుండా చిన్న అక్షరాల్లో డిస్క్లైమర్ వేశారు కానీ.. అది జనాలకు ఎక్కడ కనబడుతుంది? ‘రంగస్థలం’ సాధించిన విజయం గురించి అందరూ గొప్పగా పొగుడుతున్న సమయంలో ఇలాంటి ప్రచారం వల్ల అనవసర రచ్చ జరగడం వల్ల ఏ ప్రయోజనం లేదు. సాధించిన రికార్డు గురించి గొప్పగా చెప్పుకోవాలి కానీ.. లేని రికార్డు గురించి ఇలా ప్రచారం చేసుకోవడం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదు. మరి ఈ విషయం గుర్తించకుండా నిర్మాతలు ఎందుకు అతి చేసినట్లో అర్థం కావడం లేదు.