Begin typing your search above and press return to search.

రానాకు సెంటిమెంటు భయం

By:  Tupaki Desk   |   7 Oct 2015 2:30 PM GMT
రానాకు సెంటిమెంటు భయం
X
సినిమా వాళ్లు సెంటిమెంట్ల విషయంలో ఎంత పర్టికులర్ గా ఉంటారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కోట్లతో ముడిపడ్డ వ్యవహారం కదా.. అంతకుముందు సెంటిమెంట్లను పట్టించుకోని వాళ్లు సైతం సినిమాల్లోకి రాగానే మారిపోతారు. సిల్లీ సెంటిమెంట్లపై ఫోకస్ పెడతారు. ముఖ్యంగా కాంబినేషన్ల విషయంలో ఒకట్రెండుసార్లు తేడా వచ్చిందంటే.. ఆ తర్వాత భయం పట్టుకుంటుంది. రానా దగ్గుబాటి విషయంలో ఓ చిత్రమైన సెంటిమెంటు వెంటాడుతోంది. తన బాబాయి దగ్గుబాటి వెంకటేష్ తో చేసిన హీరోయిన్లతో రానా జత కడితే ఆ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వదని ఓ సెంటిమెంటుంది టాలీవుడ్లో.

ఇంతకుముందు వెంకీతో ‘సుభాష్ చంద్రబోస్’లో నటించిన జెనీలియా ‘నా ఇష్టం’ సినిమాలో రానాకు జోడీగా నటించింది. ఆ సినిమా దారుణమైన ఫలితాన్నిచ్చింది. ఆ తర్వాత లక్ష్మీ, తులసి లాంటి సినిమాల్లో వెంకీ సరసన నటించి లక్కీ హీరోయిన్ అనిపించుకున్న నయన్ ‘కృష్ణం వందే జగద్గురుం’లో రానా పక్కన చేసింది. ఆ సినిమా కూడా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఇప్పుడు వెంకీకి జోడీగా ‘చింతకాయల రవి’ చేసిన అనుష్క.. రానాతో కలిసి ‘రుద్రమదేవి’లో రొమాన్స్ చేసింది. మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. ఐతే రానా, అనుష్క కలిసి నటించడం ఇది తొలిసారేమీ కాదు. ఇప్పటికే ‘బాహుబలి’లో నటించారు. అది బ్లాక్ బస్టర్. కాకపోతే అందులో ఇద్దరూ జోడీగా చేయలేదు. శత్రువులుగా నటించారు. మరి జోడీగానూ హిట్టు కొట్టి సెంటిమెంటుకు బ్రేక్ వేస్తారేమో చూడాలి.