రానా రాజకీయం మరోసారి!

Mon Jul 23 2018 22:30:21 GMT+0530 (IST)

రాజకీయాలు బాగా అచ్చొచ్చాయి రానాకి. వ్యక్తిగతంగా కాదండోయ్.. సినిమా పరంగానే!  ఆయన తొలి సినిమానే `లీడర్`. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఆ చిత్రంతో రానాకి మంచి పేరొచ్చింది. ఆల్టర్నేట్ కథని ఎంచుకొని చేశాడని... ఇలాంటి కథలతో ప్రయాణం చేస్తే రానా కెరీర్ ఉజ్వలంగా ఉంటుందనే అభిప్రాయాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. అందుకు తగ్గట్టుగానే తన కెరీర్ ని మలుచుకొన్నారు రానా.  `బాహుబలి` చిత్రాల తర్వాత రానా కెరీర్ ఒడుదుడుకులకు గురవుతుందేమో అనీ.. మళ్లీ రానా సోలోగా విజయం అందుకోగలడో లేదో అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ రానా మాత్రం చాలా తెలివిగా వ్యవహరించి - తనదైన శైలిలోనే కథల్ని ఎంపిక చేసుకుని విజయాల్ని అందుకొన్నాడు.`ఘాజీ` - `నేనే రాజు నేనే మంత్రి` చిత్రాలతో రానా తిరుగులేని విజయాల్ని అందుకొన్నాడు. `నేనే రాజు నేనే మంత్రి` కూడా రాజకీయాల నేపథ్యంలోనే తెరకెక్కింది. ఆ చిత్రంతో రానా నటనలోని సత్తా ఏంటో మరోసారి తెలిసొచ్చింది. ఇకపై కూడా రాజకీయాల నేపథ్యంలో సినిమాలు చేస్తానని... త్వరలోనే ఓ సినిమా పట్టాలెక్కనుందని ఇటీవల ఓ ఇంగ్లిష్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు రానా. ఆ సినిమా ఏంటి - ఎవరితో అన్నది మాత్రం చెప్పలేదు. రాజకీయాలు తనకి బాగా అచ్చొచ్చాయని - అందులో మంచి కాన్ ఫ్లిక్ట్ కూడా ఉంటుంది కాబట్టి ప్రేక్షకులకు బాగా నచ్చుతాయని చెప్పుకొచ్చాడు రానా.