లైన్ లోకి కోడి రామ్మూర్తి బయోపిక్ కూడా

Wed May 16 2018 23:16:55 GMT+0530 (IST)

టాలీవుడ్ కి మహానటి ఇచ్చిన జోష్ మామూలుగా లేదు. జనాలకు ఇప్పుడు రొటీన్ స్టోరీలు నచ్చడం మానేశాయి. కొత్తగా ఉండే స్టోరీస్ వైపు ఆసక్తిగా చూస్తున్నారనే సంగతి.. రీసెంట్ హిట్టు ఫ్లాపు సినిమాలను చూస్తే అర్ధమయిపోతోంది. మరి కొత్త కథలు తయారు చేయడం.. వాటితో ఆడియన్స్ మెప్పించడం కాసింత క్లిష్టమైన విషయమే.అందుకే ఇప్పుడు గత తరం సెలబ్రిటీల బయోపిక్స్ ను సిద్ధం చేసేందుకు మేకర్స్ రెడీ అయిపోతున్నారు. మహానటి రిలీజ్ కు ముందే ఎన్టీఆర్.. యాత్ర అంటూ వైఎస్సార్ బయోపిక్ లు మొదలయ్యాయి. ఇప్పుడు సౌందర్య జీవిత కథ కూడా తెరకెక్కనుందని అంటున్నారు. మల్లయోధుడు కోడి రామ్మూర్తి నాయుడు గురించి.. చిన్నపుడు పాఠాల్లో చదువుకుని ఉంటాం కదా. ఆయన చరిత్రను సినిమాగా మలిచే ప్రయత్నాలు మొదలయ్యాయి. కోడి రామ్మూర్తి నాయుడిగా.. భల్లాలదేవుడు రానా నటించబోతున్నాడని తెలుస్తోంది.

ఈ పాత్రపై తన మక్కువను ఇప్పటికే తెలియచేశాడట దగ్గుబాటి రానా. కలియుగ భీముడు.. ఇండియన్ హెర్క్యులస్ వంటి బిరుదులు పొందిన కోడి రామ్మూర్తి నాయుడు.. ఏకంగా 5000 బౌట్స్ లో పరాజయం అన్నదే ఎరుగని మహా వీరుడు. అంతటి తెలుగు మహా యోధుడి చరిత్రను సినిమాగా మలిచేందుకు రంగం సిద్ధం అవుతుండగా.. ఈ చిత్ర నిర్మాణంలో ఓ హాలీవుడ్ సంస్థ కూడా భాగం కానుందనే టాక్ వినిపిస్తోంది.