Begin typing your search above and press return to search.

జాతీయ అవార్డు సాధించినట్లుంది-రమ్యకృష్ణ

By:  Tupaki Desk   |   28 July 2015 12:21 PM GMT
జాతీయ అవార్డు సాధించినట్లుంది-రమ్యకృష్ణ
X
బాహుబలి సినిమాలో ప్రతి పాత్రలోనూ ఏదో ఒక విశేషం ఉంది. అన్ని క్యారెక్టర్ల గురించి జనాలు ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. ఐతే ఎక్కువమంది చర్చించుకున్న క్యారెక్టర్లలో శివగామి పాత్ర ఒకటి. నిజంగా చెప్పాలంటే హీరో హీరోయిన్ల కంటే కూడా రమ్యకృష్ణ పోషించిన ఈ క్యారెక్టరే ఎక్కువ చర్చనీయాంశమైంది. ‘నరసింహ’లో నీలాంబరి పాత్ర తర్వాత రమ్యకృష్ణ గురించి ఈ స్థాయిలో చర్చ జరగడం ఇదే తొలిసారి. రమ్యకృష్ణ కూడా ఈ పాత్ర విషయంలో చాలా ఉద్వేగంగా మాట్లాడుతున్నారు. ఆడియో ఫంక్షన్లో ఈ పాత్ర గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న రమ్య.. సినిమాకు వస్తున్న స్పందన చూసి మరింత ఎమోషనల్ అవుతున్నారు.

తన కెరీర్లో అత్యంత కష్టపడిన పాత్రల్లో శివగామి క్యారెక్టర్ ఒకటని.. ఈ పాత్రకు సంబంధించిన షూటింగులో చాలా ఇబ్బందులు పడ్డానని చెప్పారామె. సినిమాలో ఆమె కొన్ని సన్నివేశాల్లో ఒక బిడ్డను ఒకే చేత్తో పట్టుకుని నడుస్తూ సైనికులతో యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఆ సన్నివేశాల చిత్రీకరణలో ఒళ్లు హూనమైపోయిందని.. తెరమీద ఎంత కష్టంగా అనిపిస్తుందో షూటింగులోనూ అంతే కష్టపడ్డానని చెప్పారామె. ఐతే సినిమా చూస్తుంటే మాత్రం ఆ కష్టమంతా దూదిపింజలా ఎగిరిపోయినట్లు అనిపించిందని.. జాతీయ అవార్డును సాధించినంత సంతోషంగా ఉందని రమ్య చెప్పింది. తన కెరీర్లో మైలురాయిలా నిలిచిపోయిన నీలాంబరి రోల్ కంటే కూడా శివగామి పాత్ర ప్రేక్షకుల్ని ఎక్కువ ఆకట్టుకుంటోందని రమ్య తెలిపింది. బాహుబలి-2 కోసం తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ఆమె చెప్పింది.