Begin typing your search above and press return to search.

వైఎస్ ‘యాత్ర’లో శివగామి?

By:  Tupaki Desk   |   20 April 2018 11:30 PM GMT
వైఎస్ ‘యాత్ర’లో శివగామి?
X
తెలుగులో ఒకేసారి రెండు ఆసక్తికర బయోపిక్ లు శ్రీకారం చుట్టుకున్నాయి. అందులో ఒకటి నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ‘యన్.టి.ఆర్’ కాగా.. మరొకటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలోని ముఖ్య ఘట్టాలతో రాబోతున్న ‘యాత్ర’. వీటిలో దేని ఆసక్తి దానిదే. ‘యాత్ర’ విషయానికొస్తే మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వైఎస్ పాత్రను చేయడానికి ముందుకు రావడంతో ఈ ప్రాజెక్టుకు మంచి క్రేజ్ వచ్చింది. ఇక ఈ చిత్రంలో మిగతా కీలక పాత్రలు ఎవరు చేస్తారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. వైఎస్ సతీమణి విజయమ్మ పాత్ర చేసేదెవరన్నదానిపై కొన్ని రోజులుగా రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి.

ముందు నయనతార పేరు తెరమీదికి వచ్చింది. ఆ తర్వాత మరికొన్ని ప్రచారాలు జరిగాయి. ఐతే తాజాగా మరో ఆసక్తికర పేరు తెరపైకి వచ్చింది. ‘బాహుబలి’లో శివగామి పాత్రతో దేశమంతా పాపులారిటీ సంపాదించుకున్న రమ్యకృష్ణతో విజయమ్మ పాత్ర చేయించాలని దర్శకుడు మహి.వి.రాఘవ్ ప్రయత్నిస్తున్నాడట. ఏ పాత్రలో అయినా సులువుగా ఒదిగిపోయే రమ్యకృష్ణ అయితే ఈ క్యారెక్టర్ కు న్యాయం చేస్తుందని.. ఆమె నటిస్తే ఈ సినిమాకు క్రేజ్ కూడా పెరుగుతుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ఐతే దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. మరోవైపు ఇందులో వైఎస్ జగన్ పాత్రను సూర్య చేస్తాడని ప్రచారం జరగ్గా మహి ఖండించాడు. 70 ఎం.ఎం.ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.