ఎన్టీఆర్ ను కలవాలంటున్న రమాప్రభ

Wed Jun 13 2018 16:40:48 GMT+0530 (IST)

సీనియర్ నటి రమాప్రభ కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె ఇంటర్వ్యూ ఒకటి ఈ మధ్య అందరి దృష్టిని ఆకర్షించింది. అందులో తన కెరీర్ గురించి చాలా ఆసక్తికర విషయాలు.. ప్రస్తుత ఆర్థిక ఇబ్బందుల గురించి కొన్ని బాధాకరమైన విషయాలు చెప్పారామె. తనకు పూరి జగన్నాథ్.. అక్కినేని నాగార్జున ఆర్థిక సాయం చేస్తున్న సంగతి కూడా వెల్లడించారు. ఒకప్పుడు సకల వైభోగాలతో ఉన్న తాను.. ఇప్పుడు ఏమీ లేని స్థాయికి ఎలా వచ్చానో అందులో వివరించారు. ఇండస్ట్రీలోని పలువురి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదే ఇంటర్వ్యూలో ఆమె జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అతడిని కలవాలని అనిపిస్తోందని ఆమె చెప్పడం విశేషం.ఈ మధ్య జూనియర్ ఎన్టీఆర్ చాలా పరిణతితో - తాత్వికతతో కనిపిస్తున్నాడని.. ముఖంలో రెండేళ్ల కిందటికీ.. ఇప్పటికీ 30 ఏళ్ల తేడా కనిపిస్తోందని.. అతనలా ఉంటే ఇష్టమని రమాప్రభ అన్నారు. ఎందుకో ఎన్టీఆర్ ను కలవాలనిపిస్తోందని ఆమె చెప్పారు. ఐతే ఎన్టీఆర్ ను కలవడానికి మధ్యవర్తి ఎవరూ అవసరం లేదని ఆమె అన్నారు. ‘‘ఎన్టీఆర్ ను కలవాలని ఎవరికీ చెప్పక్కర్లేదు. ప్రకృతే కలిపిస్తుంది. మధ్యవర్తి ఉండకూడదు. ప్రకృతి సంబంధిత విషయాలకు మధ్యవర్తి అవసరం లేదు. శూన్యమని ఒకటి అంటారు. వైబ్రేషన్ కలిపిస్తుంది. అది నా నమ్మకం. అది జరగడానికి దేవుడు - స్వామి.. అవ్వక్కర్లేదు. మన సంకల్పం పాజిటివ్ గా ఉంటే అది జరుగుతుంది.. జరిగి తీరుతుంది’’ అంటూ తత్వం మాట్లాడారు రమాప్రభ. మరి ఈ వ్యాఖ్యల గురించి తెలిసి ఎన్టీఆరే స్వయంగా రమాప్రభను కలుస్తాడేమో చూడాలి.