Begin typing your search above and press return to search.

ముత్తప్పారాయ్‌ కోసం డిటెక్టివ్‌ అయ్యాడు

By:  Tupaki Desk   |   5 Aug 2015 5:29 AM GMT
ముత్తప్పారాయ్‌ కోసం డిటెక్టివ్‌ అయ్యాడు
X
సత్య, కంపెనీ, సర్కార్‌ వంటి విలక్షణమైన సినిమాల్ని తెరకెక్కించాడు రామ్‌ గోపాల్‌ వర్మ. మాఫియా సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌ గా మారిన ఈ తెలుగు దర్శకుడు ముంబైని ఓ దశాబ్ధ కాలం ఒణికించాడంటే అతిశయోక్తి కాదు. అతడి ఆలోచనలు వెరీ స్పెషల్‌. ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా ఆలోచించి వివాదాస్పద కథాంశాల్ని ఎంచుకుని సినిమాలు తీయడం అతడికి మాత్రమే చెల్లిన విద్య.

ప్రస్తుతం వర్మ దృష్టి ఓ రెండు సినిమాలపై ఉంది. గంధపు చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ హత్య, పోలీస్‌ ఆపరేషన్‌ ఇన్‌ స్పిరేషన్‌ తో 'కిల్లింగ్‌ వీరప్పన్‌' తెరకెక్కిస్తున్నాడు. దీనికోసం వీరప్పన్‌ భార్య సహా పలువురిని కలిసి వివరాలు సేకరించాడు. ఆ సినిమా లైమ్‌ లైట్‌ లో ఉండగానే మరో కొత్త పల్లవి అందుకున్నాడు. ఇంతకాలం మాఫియాపై సినిమాలు తీశా. ఇక నుంచి డి-మాఫియాపై సినిమా తీస్తున్నా అంటూ ప్రచారం మొదలెట్టాడు. బెంగళూరుకు చెందిన మాఫియా డాన్‌ ముత్తప్పారాయ్‌ జీవితాన్ని వెండితెరకెక్కిస్తున్నాడు. అది కూడా ఒక డిటెక్టివ్‌ లా మారిపోయి చాలా విషయాలు తెలుసుకొని మరీ సినిమా తీస్తున్నాడట.

ముత్తప్ప ఒకప్పుడు ప్రపంచాన్ని ఒణికించిన డాన్‌. అతడి సామ్రాజ్యం బెంగళూరు, ముంబై, దుబాయ్‌, మస్కట్‌ వంటి చోట్ల విస్తరించింది. అతడి గురించి ముంబై క్రైమ్‌ పోలీస్‌, క్రైమ్‌ రిపోర్టర్స్‌, ఇతరత్రా బంధువుల వద్ద వాకబు చేసి వివరాల్ని సేకరించి ఈ సినిమా తీస్తున్నానని వర్మ చెప్పాడు. సత్య, కంపెనీ వంటి సినిమాలు తీసేప్పుడు ముత్తప్ప గురించి తెలిసిందని అప్పుడే ఈ సినిమాకి బీజం పడిందని వర్మ చెప్పుకొచ్చాడు. ముత్తప్పను కలిసే మొదటి మనిషిని నేనే అవుతా. అతడు చెప్పే వివరాలేవీ సినిమాకి సరిపోవు. అన్ని కోణాల్లో విశ్లేషించి తీస్తాను.. అంటున్నాడు ఈ మొండిఘటం.