Begin typing your search above and press return to search.

చరణ్‌ కూడా క్లాస్‌ పీకుతాడా?

By:  Tupaki Desk   |   4 Aug 2015 8:08 AM GMT
చరణ్‌ కూడా క్లాస్‌ పీకుతాడా?
X
తెలుగు సినిమాల్లో సందేశం ఇవ్వడం అంటే క్లాసు పీకడం కిందే లెక్క. మన మాస్‌ జనాలకు అంత తేలిగ్గా బుర్రకు ఎక్కవు. సందేశాన్ని మసాలా కంటెంట్‌ తో చక్కని కామెడీ ని జోడించి చెప్పే పద్ధతిలో చెబితే మాత్రం జనాలకు ఎక్కుతుంది. ఆ సంగతిని ఇటీవలి కాలంలో ఓ రెండు సినిమాలు నిరూపించాయి. పవన్‌-వెంకీ నటించిన గోపాల గోపాల, బన్ని నటించిన సన్నాఫ్‌ సత్యమూర్తి ఆ సంగతిని నిరూపించాయి. ఇప్పుడు అదే పంథాలో మహేష్‌ నటించిన శ్రీమంతుడు వస్తోంది.

కాస్త డీటెయిల్డ్‌ గా విశ్లేషిస్తే .. గోపాల గోపాల చిత్రంలో పవన్‌ దేవుడిగా బోలెడంత క్లాస్‌ తీసుకుంటాడు. భక్తులకు బోలెడంత ఉద్భోద చేసి కామెడీ పండించే ప్రయత్నం చేశాడు పవన్‌. వితండవాదం, తర్కం లాంటి విషయాల్ని సందేశాత్మకంగా వివరించి చెప్పారు. అది బాగానే వర్కవుటై సినిమా విజయం సాధించింది. అలాగే బన్ని నటించిన సన్నాఫ్‌ సత్యమూర్తి లో త్రివిక్రమ్‌ తనదైన శైలిలో క్లాస్‌ పీకించాడు. బన్ని పాత్ర నీతిని, నిబద్ధతకు కట్టుబడి ఉంటుంది. తండ్రి నీతిమంతుడు, విలువలతో బతికాడు. నేనూ అలాగే బతుకుతా.. అని నిరూపించే ప్రయత్నంలో బోలెడంత క్లాస్‌ తీసుకుంటాడు. ఇదేం క్లాస్‌ పీకుడు? అని ఏవగించుకోకుండా జనాలు మెచ్చుకుని సినిమాని హిట్‌ చేశారు.

లేటెస్టుగా వస్తున్న శ్రీమంతుడు లోనూ మహేష్‌ క్లాస్‌ తీసుకుంటున్నాడని ట్రైలర్‌ చూస్తే తెలిసిపోతోంది. అయితే క్లాస్‌ తీస్కోవడంలో కూడా తనకో స్టయిల్‌ ఉందని ప్రిన్స్‌ నిరూపించాడు. వీడ్ని, వాడ్ని, నిన్ను, వీళ్లందరినీ దత్తత తీసుకుంటా.. అంటూ మాస్‌ స్టయిల్‌ లో అదరగొట్టేశాడు. ఈ శుక్రవారం శ్రీమంతుడు బాక్సాఫీస్‌ బరిలో దిగిపోతున్నాడు. అలాగే చరణ్‌ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న బ్రూస్లీ క్లాస్‌ తీసుకుంటాడా? లేదా? అన్న ఆసక్తికర విశ్లేషణ మొదలైంది. చరణ్‌ ఈ చిత్రంలో ఫైట్‌ అసిస్టెంట్‌ గా నటిస్తున్నాడు. శ్రీనువైట్ల ప్రతిసారీ తన సినిమాల్లో కొన్ని ప్రత్యేక క్యారెక్టర్ల ను క్రియేట్‌ చేసి మరీ క్లాస్‌ తీసుకుంటాడు. కాబట్టి ఇందులో హీరో పాత్రతో క్లాస్‌ తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని అనుకుంటున్నారు. ఎవరు ఎన్ని క్లాసులు తీసుకున్నా అంతిమంగా వినోదం, సక్సెస్‌ ముఖ్యం. అవే గీటురాళ్లు.