మెగా హీరోల సినిమాలకు సంబంధించిన వేడుకలైనా.. వాళ్లు పాల్గొనే వేరే సినిమాల ఫంక్షన్లయినా.. పవర్ స్టార్ నినాదాలు కామన్. ప్రతిసారీ వాళ్లను అడ్రస్ చేయడం.. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం అంటే ఇబ్బందికరమైన విషయమే. అలాగని పట్టించుకోకుండా సైలెంటుగా ఉంటే మరింత ఇబ్బంది తప్పదు. దీని చుట్టూ నెలకొన్న వివాదాల సంగతీ తెలిసిందే. ఈ నేపథ్యంలో సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కిన ‘దర్శకుడు’ సినిమా ఆడియో వేడుకకు వచ్చిన రామ్ చరణ్ కు కూడా పవన్ అభిమానుల తాకిడి తప్పలేదు. అతను మాట్లాడుతున్నంతసేపూ పవర్ స్టార్ నినాదాలతో ఆడిటోరియం హోరెత్తింది. చాలాసేపు ఓపిక పట్టిన చరణ్ చివరికి ఓ దశలో బాబాయి ప్రస్తావన తెచ్చాడు.
తన కుటుంబ సభ్యుల మీద ప్రేమ తన మనసులో ఉంటుందని.. అది వాళ్లకు తెలుసని.. దాన్ని తాను ఇలాంటి వేదికల్లో బయటపెట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు చరణ్. అభిమానుల్ని సుతిమెత్తగా హెచ్చరిస్తున్నట్లుగా ఉంటూనే అదే సమయంలో వినమ్రంగానూ మాట్లాడటం ద్వారా కట్టె విరక్కుండా.. పాము చావకుండా అన్న తరహాలో వ్యవహరించాడు చరణ్. దీని కంటే ముందు సుకుమార్ గురించి చెబుతూ.. ఆయన తన ఫేవరెట్ డైరెక్టర్ అని.. ఆయనతో కొన్ని నిమిషాల్లోనే తాను కనెక్టయిపోయానని చెప్పాడు చరణ్. సుకుమార్ దగ్గరున్నఐడియాలన్నింటినీ సినిమాలుగా తీయాలంటే ఆయనకు ఒక జీవిత కాలం సరిపోదని.. కాబట్టే ‘సుకుమార్ రైటింగ్స్’ అనే బేనర్ పెట్టి మంచి పని చేశాడని చెప్పాడు చరణ్. సుక్కుతో పని చేస్తున్న ‘రంగస్థలం’ తనకు అద్భుతమైన అనుభవమని తెలిపాడతను. తన తండ్రి తనకు ఫ్లాట్ ఫాం ఇచ్చినప్పటికీ.. తనను హీరోగా నిలబెట్టిన ఘనత దర్శకులదే అంటూ తన డైరెక్టర్లందరినీ గౌరవించుకున్నాడు చరణ్.