Begin typing your search above and press return to search.

దావూద్.. పవన్.. తేడా చెప్పిన వర్మ

By:  Tupaki Desk   |   16 May 2018 11:09 AM GMT
దావూద్.. పవన్.. తేడా చెప్పిన వర్మ
X
రామ్ గోపాల్ వర్మకు పవన్ కళ్యాణ్ అభిమానులకు మధ్య చాన్నాళ్లుగా రగడ నడుస్తున్న సంగతి తెలిసిందే. పవన్ ను ఉద్దేశించి ఎన్నోసార్లు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు వర్మ. ఇటీవలి కాలంలో మరీ శ్రుతి మించి శ్రీరెడ్డితో అతడిని బూతు తిట్టించే వరకు వెళ్లింది. ఆ సయయంలో కాస్త సంయమనం పాటించిన వర్మ.. తర్వాత మళ్లీ పవన్.. అతడి అభిమానుల్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు. చాలా ఆవేశంగా కనిపించే పవన్ అభిమానుల్ని చూసి వర్మ భయపడకపోవడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇదే విషయమై వర్మను అడిగితే ఆసక్తికర సమాధానం చెప్పాడు. నిజానికి తనను భయపెట్టిన వ్యక్తులు కానీ.. సంఘటనలు కానీ లేవన్న వర్మ.. తాను అందరి విషయంలోనూ ఒకే రకంగా వ్యవహరించనని చెప్పాడు. ఇందుకు దావూద్ ఇబ్రహీంను ఉదాహరణగా చెప్పాడు. తాను దావూద్ ను ఎప్పుడైనా ఏమైనా అన్నానా అని ప్రశ్నించడం గమనార్హం.

‘‘నేను దావుద్‌ ఇబ్రహీంను ఏమైనా అంటానా? వాళ్లనంటే సైలెంట్‌ గా బుల్లెట్ ఎక్కడి నుంచో దూసుకొస్తుందని నాకు తెలుసు. పవన్ కళ్యాన్.. అతడి అభిమానుల విషయానికి వస్తే.. మొన్నటికి మొన్న ఫిలిం ఛాంబర్‌ కి పవన్ కల్యాణ్ వచ్చినప్పుడు ఆయన అభిమానులు ‘నరికేస్తాం - చంపేస్తాం - రక్కేస్తాం’ అన్నారు. ఏమైంది? మీడియా వాళ్లు కెమెరాలు తీయగానే వాళ్లంతా నేరుగా మహేష్ బాబు సినిమాకి వెళ్లుంటారు. అలా మాట్లాడే వాళ్లకి ధైర్యం సెల్‌ ఫోన్ వల్లే వస్తుంది. ఎందుకంటే వాళ్లు, సెల్‌ ఫోన్ మాత్రమే ఉంటారు కాబట్టి. వాళ్లు ఫోన్ ద్వారా ఇలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నపుడు అక్కడికి వాళ్ల అమ్మ వచ్చినా భయపడతారు. అలాంటి వాళ్లు నన్నేం చేస్తారు?’’ అని వర్మ ప్రశ్నించాడు. నిజానికి తనను భయపెట్టిన వ్యక్తులు కానీ.. సంఘటనలు కానీ అసలు లేవని వర్మ అన్నాడు. మనం విలువ ఇచ్చేది మన దగ్గర్నుంచి పోతే భయం కలుగుతుందని.. కానీ తన దగ్గర అలాంటివేవీ లేవని వర్మ చెప్పాడు. తనది ధైర్యం కాదు.. అండర్ స్టాండింగ్ అని వర్మ వ్యాఖ్యానించడం విశేషం.