మియాతో ఇలా.. నాగార్జునతో అలా

Sun Jan 21 2018 11:46:38 GMT+0530 (IST)

కొన్నాళ్ల పాటు సైలెంటుగా ఉన్న రామ్ గోపాల్ వర్మ మళ్లీ మీడియాలోకి వచ్చేశాడు. పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో ఆయన తీస్తున్న ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ అనే సినిమా కాని సినిమా హాట్ టాపిక్ అవుతోంది. దీనికి సంబంధించిన ఫొటోలు.. ట్రైలర్.. ఫిలాసఫీలు.. చర్చోపచర్చలు.. వాగ్వాదాలతో వర్మ పేరు మార్మోగిపోతోంది. ఈ విషయంలో వర్మను సంప్రదాయవాదులు తెగ తిట్టిపోస్తున్నారు. వర్మ మాత్రం టీవీ ఛానెళ్లలో థిలాసాగా కూర్చుని వాళ్లతో తాపీగా వాదోపవాదాలు చేస్తున్నాడు. సోషల్ మీడియాను కూడా ఈ వాదనలకు వేదిక చేసుకుంటున్నాడు.ఐతే అందరూ ‘జీఎస్టీ’ గురించి చర్చించుకుంటూ వర్మ నాగార్జునతో కలిసి ఒక సినిమా తీస్తున్న విషయాన్నే మరిచిపోయారు. విశేషం ఏంటంటే.. వర్మ ‘జీఎస్టీ’ పనుల్లో.. వాదనల్లో పడి ఆ పనిని పక్కన పెట్టేయలేదు. దీనిపాటికి ఇది నడుస్తుంటే.. మరోపక్క నాగ్ సినిమా షూటింగ్ కూడా చకచకా అవగొట్టేస్తున్నాడు వర్మ. నవంబరు 20న ఈ చిత్ర షూటింగ్ మొదలై తొలి షెడ్యూల్ పది రోజులు సాగింది. ఆ తర్వాత నాగ్ ‘హలో’ కోసం బ్రేక్ తీసుకున్నాడు. మళ్లీ ఈ చిత్ర రెండో షెడ్యూల్ మొదలుపెట్టాడు. 15 రోజుల షెడ్యూల్ ఈ మధ్యే పూర్తయింది. ఇప్పుడిక ఈ చిత్ర బృందం ముంబయికి వెళ్లబోతోంది. ఇంకొన్ని రోజుల్లోనే అక్కడ తర్వాతి షెడ్యూల్ మొదలవుతుంది. ఐతే తనతో సినిమా తీయాలంటే.. మిగతా సినిమాలన్నీ పక్కన పెట్టాలన్న షరతు పెట్టి మరీ ఈ సినిమా ఓకే చేశాడు నాగ్. మరి ఆ సినిమా మధ్యలో ‘జీఎస్టీ’ గొడవతో రచ్చ లేపడంపై నాగ్ ఏమీ అనట్లేదా? షూటింగ్ టైంలో వర్మకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయడం లేదా? అన్నది యూనిట్ వర్గాలకే తెలియాలి.