Begin typing your search above and press return to search.

ఆ విషయంలో మాత్రం వర్మ గ్రేట్

By:  Tupaki Desk   |   27 May 2017 9:25 AM GMT
ఆ విషయంలో మాత్రం వర్మ గ్రేట్
X
వరుస రెండు మూడు ఫ్లాపులిస్తే చాలు.. దర్శకుల జాతకాలు మారిపోతుంటాయి. మార్కెట్ పడిపోతుంది. మళ్లీ అవకాశాలు దొరకడం కష్టమవుతుంది. హీరోలు.. నిర్మాతలు పట్టించుకోవడం మానేస్తుంటారు. ఇలా చాలామంది కెరీర్లే క్లోజ్ అయిపోవడం చూశాం. అలాంటిది గత దశాబ్ద కాలంలో రామ్ గోపాల్ వర్మ ఎన్ని ఫ్లాపులిచ్చాడో లెక్కబెట్టి చెప్పడం కూడా కష్టం. అయినప్పటికీ వర్మ ఇంకా సర్వైవ్ అవుతుండటం.. ఒకదాని తర్వాత ఇంకో ప్రాజెక్టు లైన్లో పెడుతుండటం.. నిర్మాతల్ని.. నటీనటుల్ని ఒప్పిస్తుండటం విశేషమే. అమితాబ్ బచ్చన్ లాంటి బిజీ ఆర్టిస్టును ఈ టైంలో ఒప్పించి.. ‘సర్కార్-3’ చేయడం.. ఈరోస్ ఇంటర్నేషనల్ లాంటి పెద్ద సంస్థతో ఈ చిత్రానికి పెట్టుబడి పెట్టించడం చిన్న విషయం కాదు. తన ట్రాక్ రికార్డు పేలవంగా ఉన్నప్పటికీ వర్మ వీళ్లను ఎలా కన్విన్స్ చేయగలిగాడన్నది అంతుబట్టని విషయం.

వర్మ సినిమా ఫ్లాప్ అయినప్పుడల్లా.. ఈ దెబ్బతో అతడి పనైపోయిందని అనుకుంటూ ఉంటారు జనాలు. కానీ వర్మ మాత్రం దాని సంగతి వదిలేసి కొత్త ప్రాజెక్టును తెరమీదికి తెస్తాడు. ‘సర్కార్-3’ తర్వాత కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. అందరూ ఆ సినిమా ఫ్లాప్ కావడం గురించే మాట్లాడుకుంటుంటే.. వర్మ సైలెంటుగా ‘గన్స్ అండ్ థైస్’ అంటూ ఒక సెన్సేషనల్ వెబ్ సిరీస్ అనౌన్స్ చేశాడు. దీని ట్రైలర్ నిన్నట్నుంచి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పెద్ద చర్చకు దారి తీస్తోంది. పది ఎపిసోడ్ల చొప్పున నాలుగు సిరీస్ లుగా ‘గన్స్ అండ్ థైస్’ ప్లాన్ చేశాడు వర్మ. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ చూస్తే.. సినిమా క్వాలిటీకి ఏమాత్రం తక్కువగా ఉండబోదని అర్థమవుతోంది.

ఈ సిరీస్ ను ప్రొడ్యూస్ చేయడానికి జర్మనీకి చెందిన స్టార్మ్ సెల్ ఎంటర్టైన్మెంట్ అనే సంస్థను ఒప్పించాడు వర్మ. అలాగే ఈ సినిమా కోసం చాలామంది నటీనటుల్ని.. టెక్నీషియన్లను కూడా ఒప్పించి నటింపజేశాడు. ఇందులో ఓ అమ్మాయి పూర్తి నగ్నంగా కనిపించడం విశేషం. పేలవమైన ట్రాక్ రికార్డు కనిపిస్తుండగా.. ఇలా ఇంతమందిని మెప్పించి.. ఒప్పించి వెబ్ సిరీస్ చేయడం అంటే మాటలు కాదు. ఈ విషయంలో మాత్రం వర్మను కొట్టేవాడు లేడనే చెప్పాలి. వర్మ మాఫియా సినిమాల్ని ఇష్టపడే ప్రేక్షకుల్ని బాగా ఆకర్షిస్తున్న ‘గన్స్ అండ్ థైస్’ వెబ్ సిరీస్ మంచి ఆదరణ దక్కించుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇది క్లిక్ అయితే వర్మ సినిమాలు వదిలేసి ఇలాంటి వాటికే పరిమితమైనా ఆశ్చర్యం లేదేమో.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/