వర్మ శోకం బద్ధలైంది..!

Sun Feb 25 2018 10:27:08 GMT+0530 (IST)

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఇది అందరికి తెలిసిందే. ఆయనెంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా.. ఆయన విమర్శ చేయని వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అంటే శ్రీదేవే. అతిలోక సుందరిగా అందరి మనసుల్ని దోచుకున్న శ్రీదేవికి.. వర్మకు మించిన అభిమాని.. ఆరాధకుడు మరొకరు ఉండరేమో?ఒక సెలబ్రిటీ మీద అభిమానం.. ఆరాధనను అంత ఓపెన్ గా ఎక్స్ ప్రెస్ చేసే వర్మ లాంటి సెలబ్రిటీ ఎక్కడా ఉండరేమో. శ్రీదేవి అంటే తనకెంత అభిమానమన్నది తనకు అవకాశం వచ్చినప్పుడల్లా చెప్పే వర్మకు.. ఆమె మరణం గుండెలు బద్ధలయ్యేలా చేసినట్లు చెప్పాలి. ఆమె మరణవార్తను తెల్లవారుజామున మీడియాతో సమానంగా ట్వీ్ట్ చేసిన వర్మ.. ఆ తర్వాత కాసేపటికి ఒకసారి ఏదో ఒక ట్వీట్ చేస్తూనే ఉన్నారు.

ఇక ఫేస్ బుక్ లో అయితే భారీ లేఖనే రాసేశారు. శ్రీదేవిని చంపినందుకు దేవుడ్ని ద్వేషిస్తున్నా.. మరణించినందుకు శ్రీదేవిని ద్వేషిస్తున్నా అంటూ మొదలెట్టిన వర్మ.. చివర్లో మాత్రం ఆమెను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా.. ఆరాధిస్తూనే ఉంటానంటూ ముగించారు.

కరిగే కాలంతో పాటు ప్రతి విషయం మీదా అభిప్రాయాలు ఎప్పటికప్పుడు మరిపోతూ ఉంటాయని నమ్మే వర్మ విషయంలో తన యూత్ నుంచి ఇప్పటివరకూ ఆయనలో మార్పులేనిది ఏమైనా ఉందంటే అది శ్రీదేవి మీద ఉన్న అరాధనేనని చెప్పాలి. ఒక సినీ ప్రముఖురాలిని.. ఒక సినీ ప్రముఖుడు విపరీతంగా ఆరాధించటమే కాదు.. ఆమె  అంటే తనకున్న ఇష్టాన్ని ఓపెన్ గా చెబుతూ.. కపూర్ ఫ్యామిలీ అసౌకర్యానికి గురయ్యేలా  చేశారన్న మాట కూడా ఉంది.

అయినప్పటికీ తన అభిమానాన్ని.. ఆరాధనను చెప్పేందుకు వర్మ ఏ మాత్రం వెనుకాడలేదు. ఇక.. శ్రీదేవిని పెళ్లాడిన బోనీకపూర్ మీద వర్మ చేసిన వ్యాఖ్యలైతే సంచలనం సృష్టించాయి.

శ్రీదేవి మరణవార్త వర్మను ఎంతగా కలిచివేసిందన్న విషయం ఆయన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన భారీ పోస్ట్ ను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. శ్రీదేవి గురుతులతో మునిగిపోయిన ఆయన.. తాను చేసిన శ్రీదేవి మొదటి సినిమా మొదలు.. శ్రీదేవితో మొదటి మీటింగ్.. ఆమెతో తాను తీసిన క్షణ క్షణం సినిమా గురించి.. ఆమె అంటే తనకెంతో ప్రేమ అన్న విషయాన్ని వివరంగా చెప్పుకున్నారు.

తనకు నిద్ర మధ్యలో లేచి.. ఫోన్ లో మెసేజ్ లు చూసుకునే అలవాటు ఉందని.. ఈ రోజు అలానే చేసినప్పుడు.. శ్రీదేవి మరణానికి సంబంధించిన మెసేజ్ వచ్చిందని.. తాను షాక్ కు గురయ్యానని.. తప్పేమోనని అనుకున్నానని.. పీడకలగా ఫీలయ్యానని.. కానీ ఆమె మరణం నిజమేనంటూ యాభై మెసేజ్ లు తనకు వచ్చినట్లుగా పేర్కొన్నారు. శ్రీదేవి తనకెలా పరిచయమైందో రాసుకుంటూ వచ్చిన వర్మ.. తన ఆరాధనను భారీగా రాసేశారు. చివర్లో శ్రీదేవిని క్రియేట్ చేసిన దేవుడికి థ్యాంక్స్ చెప్పిన వర్మ.. కెమేరాను కనుగొన్న లూయిస్ కు థ్యాంక్స్ చెప్పారు. ఆమెను బంధించటానికి సాయం చేసిందన్న వర్మ.. తాను ఇప్పటికి ఒక చెడ్డ కలను కంటున్నట్లుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. శ్రీదేవి లేదన్నది తానిప్పటికీ నమ్మలేకపోతున్నానన్నాడు. శ్రీదేవిని తీసుకెళ్లిపోయిన భగవంతుడ్ని తిట్టటం మొదలెట్టిన వర్మ.. శ్రీదేవి దేవత కాదని.. మామూలు మనిషేనని రుజువైందన్నాడు. ఆమె గుండె ఆగిపోవటాన్ని తాను ద్వేషిస్తున్నట్లు పేర్కొన్న వర్మ.. మిగిలిన వారి మాదిరే శ్రీదేవి గుండె కోసం కొట్టుకోవటం ఆగిపోవటమా అని పేర్కొంటూ.. శ్రీదేవి మరణాన్ని తాను ద్వేషిస్తున్నానని చెబుతూ చివరగా మాత్రం.. నువ్వు ఎక్కడు ఉన్నా.. నేను నిన్ను ప్రేమిస్తాను శ్రీ.. నేనెప్పుడూ ప్రేమిస్తూనే ఉంటానని కంక్లూడ్ చేశారు.

ఫేస్ బుక్ లో శ్రీదేవిపై తనకున్న ఆరాధన భావాన్ని పంచుకున్న వర్మ పోస్ట్ కు భారీ స్పందన వచ్చింది. కొందరి వ్యాఖ్యలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. శ్రీదేవి మరణవార్త విన్న వెంటనే తనకు బోనీ కపూర్ కాకుండా ఆర్జీవీనే గుర్తుకు వచ్చాడని పేర్కొంటే.. "శ్రీదేవంటే మీకున్న పిచ్చి చాలా ఎక్కువని అనిపించేదని.. కానీ మీ సౌందర్య ఆరాధన.. భావుకత ఈ రోజు అర్థమైందంటూ.. మీ గుండెను ఓపెన్ చేశా"రంటూ ఒకరు పోస్ట్ పెట్టారు.