Begin typing your search above and press return to search.

గీత కోసమేనా వర్మా ఈ ఎత్తులు ?

By:  Tupaki Desk   |   17 Oct 2018 7:07 AM GMT
గీత కోసమేనా వర్మా ఈ ఎత్తులు ?
X
ఏదో ఒక సంచలనం లేనిదే తన సినిమాల పబ్లిసిటీ చేసుకోని రామ్ గోపాల్ వర్మ హఠాత్తుగా కొద్దిరోజుల క్రితం లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించి మళ్ళి కొత్త పాట మొదలుపెట్టడంతో అందరూ ఆశ్చర్యపోయారు. నిజానికి గత ఏడాది ప్రకటించిన ఈ సినిమా తర్వాత ఏ కారణం చెప్పకూండా వర్మ డ్రాప్ అయ్యాడు. ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వకుండా ట్విట్టర్ లో దాని ప్రస్తావన తీసుకురావడం కూడా మానేశాడు. ఇప్పుడు అనూహ్యంగా తెరమీదుకు మళ్ళి లక్ష్మిస్ ఎన్టీఆర్ పేరును తీసుకురావడమే కాదు ఏకంగా జనవరిలో విడుదల అని చెప్పేసాడు. నిజంగా వర్మ అన్నట్టుగా తీస్తాడా అనేది ఎవరూ చెప్పలేరు.

ఇక్కడ కాస్త లోతుగా ఆలోచిస్తే మరో కోణం కనిపిస్తోంది వర్మ రచన చేసి నిర్మాతగా వ్యవహరించిన భైరవగీత అనే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. సిద్దార్థ్ శంకర్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ కొత్త వాళ్ళతో తీసిన ఈ మూవీ ట్రైలర్ రెండు నెలల క్రితమే విడుదలైంది. ఆ సమయంలోనే రిలీజ్ డేట్ ని అక్టోబర్ 12గా ఫిక్స్ చేసి ఆ మేరకు తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. అంతే కాదు తారక్ సినిమాతో ఢీ కొనబోతున్నామని గట్టి హిట్ ఖాయమని కాస్త అతిశయోక్తిగానే పోయాడు.

తీరా చెప్పిన టైంకి భైరవగీత రాలేదు. ఆశించిన రీతిలో బిజినెస్ జరగకపోవడంతో పాటు థియేటర్ల కొరత కారణంగా వర్మ వాయిదా వేయక తప్పలేదని ఓ టాక్ ఉంది. సో బజ్ లేని ఈ సినిమాకు హైప్ రావాలనే ఉద్దేశంతోనే వర్మ ఇప్పుడు లక్ష్మిస్ ఎన్టీఆర్ టాపిక్ తెరమీదకు తీసుకొచ్చాడా అనే అనుమానం కలగడం సహజం. వరస చూస్తుంటే అలాగే అనిపిస్తోంది మరి.

ఇది కాదని తేలాలంటే లక్ష్మిస్ ఎన్టీఆర్ షూటింగ్ ను త్వరగా మొదలుపెట్టాలి. చంద్రబాబు నాయుడు పోలికలో ఉన్న వ్యక్తిని లక్ష రూపాయలు ఖర్చు పెట్టి మరీ వెతికి పట్టుకున్న వర్మ నిజంగానే లక్ష్మిస్ ఎన్టీఆర్ తీసి చెప్పిన టైంకి విడుదల చేస్తే అదే సమయంలో వస్తున్న ఎన్టీఆర్ మహానాయకుడికి ఇబ్బంది కలిగించడం ఖాయం. చూస్తుంటే సినిమాను మించిన రసవత్తరమైన కథ నిర్మాణంలోనే కనిపిస్తోంది.