Begin typing your search above and press return to search.

నాగ్-వర్మ రెండే రెండు నెలల్లో..

By:  Tupaki Desk   |   21 Oct 2017 4:18 AM GMT
నాగ్-వర్మ రెండే రెండు నెలల్లో..
X
గత దశాబ్ద కాలంలో రామ్ గోపాల్ వర్మ ట్రాక్ రికార్డు ఏంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఐతే ఎన్ని ఫ్లాపులు వచ్చినా.. హీరోలను.. నిర్మాతలను ఒప్పించి సినిమాలు చేయడంలో వర్మ విజయవంతమవుతూనే ఉన్నాడు. ఐతే ఇప్పటిదాకా ఆయన ఎంతమందినైనా మెప్పించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు సీనియర్ హీరో అక్కినేని నాగార్జునను ఒప్పించడమే అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం. నాగార్జున సినిమాల ఎంపికలో ఎంత జాగ్రత్తగా ఉంటాడో తెలిసిందే. ఆయన జడ్జిమెంట్ స్కిల్స్ మీద టాలీవుడ్ జనాలకు మంచి గురి ఉంది. అలాంటి ఆయన్ని వర్మ ఓ కథ చెప్పి ఒప్పించడం విశేషమే. వర్మ తనకు మంచి కథ చెప్పినట్లు ‘రాజు గారి గది-2’ ప్రమోషన్ల సందర్భంగా నాగార్జునే స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇదే ఇంటెన్సిటీతో ఫుల్ నరేషన్ ఇస్తే వర్మతో సినిమా చేస్తానని నాగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ఏంటంటే.. నాగార్జునకు వర్మ ఫుల్ నరేషన్ ఇచ్చేశాడట. నాగ్ సినిమా చేయడానికి ఓకే చెప్పేశాడట. వర్మ కూడా ఈ సినిమా చేయబోతున్నట్లు కన్ఫమ్ చేసిన సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ జీవిత కథ నేపథ్యంలో ఫిబ్రవరి నుంచి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చేయడానికి సిద్ధమవుతున్న వర్మ.. ఆలోపే నాగార్జునతో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. రెండే రెండు నెలల్లో ఈ సినిమాను ముగించడానికి వర్మ ప్లాన్ చేస్తున్నాడట. నిర్మాత కూడా రెడీగా ఉన్నట్లు సమాచారం. తక్కువ బడ్జెట్లో.. తక్కువ వర్కింగ్ డేస్ లో ఈ సినిమా పూర్తవుతుందట. ప్రస్తుతం వర్మ దృష్టి ఈ సినిమా మీదే ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ నవంబర్లో సినిమా మొదలుపెట్టి.. జనవరికల్లా ముగించాలని అనుకుంటున్నారట. నాగ్ కూడా ఫిబ్రవరి నుంచే నాని కాంబినేషన్లో మల్టీస్టారర్ మొదలుపెడుతున్నాడు.